
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం: ఇక ఫైనలియర్ విద్యార్థులకూ ఛాన్స్
దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ అందించి, వారిని ఉపాధికి సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం(పీఎంఐఎస్)లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు డిగ్రీ పూర్తయిన వారికి మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని, ఇకపై డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా వర్తింపజేస్తూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ వెసులుబాటు కల్పించారు.
ముఖ్యమైన మార్పులు ఇవే..
కేంద్ర విద్యాశాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కొత్త మార్పులను అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మార్పుల ప్రకారం, ఇకపై డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా నేరుగా ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికోసం విద్యార్థులు తమ కళాశాల నుండి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' తప్పనిసరిగా సమర్పించాలి. ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల చదువుకు, పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రిన్సిపాల్ లేదా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ సంతకం చేసిన పత్రాన్ని పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 18 నుండి 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్న యువత మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అర్హులు.
ఈ పథకం ద్వారా ఎంపికైన వారికి దేశంలోని దాదాపు 300కు పైగా ప్రముఖ కంపెనీల్లో శిక్షణ పొందే గొప్ప అవకాశం లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో అభ్యర్థులకు ప్రతి నెలా రూ.9,000 గౌరవ వేతనం ఆర్థిక సాయంగా అందుతుంది. వివిధ రంగాలకు చెందిన పెద్ద కంపెనీలు తమ దగ్గర ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు అధికారిక పోర్టల్‌లో ప్రకటిస్తుంటాయి, కాబట్టి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.
విద్యార్థి దశలోనే వృత్తి నైపుణ్యం
జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రయోగాత్మక అభ్యాసానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదువు పూర్తికాకముందే కార్పొరేట్ వాతావరణంపై అవగాహన కల్పించడం ద్వారా, విద్యార్థులు డిగ్రీ చేతికి రాగానే నేరుగా ఉద్యోగాల్లో చేరడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు. సమస్యల పరిష్కారం, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ వంటి అంశాల్లో ఈ ఇంటర్న్‌షిప్ ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
దరఖాస్తు విధానం
అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.pminternship.mca.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడో విడత పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. విద్యార్థులు తమ కెరీర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్న రంగాలను ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
