Let's talk: editor@tmv.in
దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Gaddamidi Naveen
24 మే, 2026

దేశవ్యాప్తంగా సామాన్యుడిపై ఇంధన భారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో, ఆ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులపైకి బదిలీ చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 87 నుంచి 91 పైసల వరకు పెంచారు. దీంతో గడిచిన 10 రోజులలోనే ఇంధన ధరలు మొత్తంగా దాదాపు రూ.5 మేర పెరిగినట్లయింది.

పెట్రోల్, డీజిల్‌తో పాటు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరను కూడా కిలోకు రూ.1 పెంచారు. ఇటీవలి కాలంలో సీఎన్‌జీ ధర పెరగడం ఇది మూడోసారి కాగా, మొత్తంగా దీని ధర కిలోకు రూ.4 మేర పెరిగింది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం, రూపాయి విలువ క్షీణించడం, చమురు శుద్ధి కంపెనీల మార్జిన్లు తగ్గడం వల్లే ఈ వరుస ధరల పెంపు అనివార్యమైందని పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి.

ప్రధాన నగరాల్లో తాజా ధరల వివరాలు (లీటరుకు)

ఢిల్లీ:

పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి రూ.99.51కి చేరింది. డీజిల్ ధర 91 పైసలు పెరిగి రూ.92.49కు చేరుకుంది.

ముంబై:

ముంబైలోని ప్రభుత్వ బంకుల్లో పెట్రోల్ లీటరు రూ.108.49 కాగా, డీజిల్ ధర రూ.95.02 గా నమోదైంది.

కోల్‌కతా : ఇక్కడ పెట్రోల్ ధర రూ.110.64 కు, డీజిల్ ధర రూ.97.02 కు పెరిగింది.

చెన్నై:

చెన్నైలో పెట్రోల్ లీటరు రూ.105.31కు, డీజిల్ రూ.96.98 కి చేరింది.

హైదరాబాద్‌:

ఇక, తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.84కు చేరగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.94కి పెరిగాయి.

ధరల పెంపు ప్రయాణం

గతంలో సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరల సవరణ ప్రక్రియను చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ ఏడాది మే 15న పునఃప్రారంభించాయి. మే 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచారు. మే 19వ తేదీన మరోసారి లీటరుకు 90 పైసలు పెంచారు. శనివారం పెంపుతో కలిపి కేవలం పది రోజుల్లోనే లీటరుకు దాదాపు రూ.5 భారం పడింది. మరోవైపు, ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.80.09 నుంచి రూ.81.09 కి పెరిగినట్లు ఐజీఎల్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మే 15న రూ.2, మే 17న రూ.1 చొప్పున పెరిగిన సీఎన్‌జీ ధర, తాజాగా మరో రూపాయి పెరగడంతో మొత్తం రూ.4 భారం పడింది. ఈ ప్రభావం చుట్టుపక్కల నగరాలపై కూడా పడింది.

ఫిబ్రవరి చివరి వారం నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' మార్గంలో షిప్‌మెంట్‌లకు ఆటంకాలు కలగడమే దీనికి ప్రధాన కారణం.

ప్రధాని మోడీ ఇంధన పొదుపు పిలుపు

పెరుగుతున్న చమురు దిగుమతి బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత వారం దేశ ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు కీలక పిలుపునిచ్చారు. ఇంధనాన్ని ఆదా చేయాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని, ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్రోత్సహించాలని సూచించారు. దీని ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాఖల ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఈ ఇంధన ధరల పెంపు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.40 శాతం ఉండగా, ఏప్రిల్‌ నాటికి 3.48 శాతానికి చేరింది. అలాగే హోల్‌సేల్ ద్రవ్యోల్బణం చమురు, ఇంధన ధరల కారణంగా 42 నెలల గరిష్ట స్థాయి అయిన 8.3 శాతానికి చేరుకోవడం గమనార్హం.