
వానాకాల రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి
గ్రామీణ ప్రాంతాల రవాణా కష్టాలను తీర్చి, పల్లెలను ప్రగతి బాటలో నడిపించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలంలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. దుబ్బతండా, లాల్ సింగ్ తండా, జీళ్ళచెరువు గ్రామాల్లో రూ. 16.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు బీటీ రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వర్షాకాలంలో తండాలు, పల్లె ప్రజలు బురద రోడ్ల వల్ల, ఉధృతంగా ప్రవహించే వాగుల వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ పనులను త్వరితగతిన మంజూరు చేయించామని తెలిపారు. వానలు పడుతున్నా ప్రజల కోసం ప్రగతి పనులు ఆపబోమని స్పష్టం చేసిన మంత్రి.. అధికారులు కూడా అంతే వేగంతో, నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
దుబ్బతండా గ్రామంలో జడ్పీ రోడ్డు గైగోల్లపల్లి నుంచి దుబ్బతండా వరకు రూ.2.10 కోట్లతో, అలాగే జడ్పీ రోడ్డు నుంచి కొత్తూరు–ఎర్రగడ్డ తండా మీదుగా దుబ్బతండా వరకు రూ.4.50 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లాల్ సింగ్ తండా నుంచి నేరేడువాయి వరకు రూ.2.03 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. జీళ్ళచెరువు గ్రామంలో కొండాపురం–మోటాపురం ప్రధాన రహదారిపై రూ.7.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రెండు వంతెనల పనులను ప్రారంభించారు. వానాకాలం రవాణా కష్టాలకు ఈ పనుల ద్వారా శాశ్వత పరిష్కారం లభించనుందని మంత్రి పేర్కొన్నారు.
