
అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు.. కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పార్థసారథి
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు అందించి, వారి సొంత ఇంటి కల నిజం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబడుతున్నారని తెలిపారు.
2014–19 మధ్య 13.04 లక్షల ఇళ్లను మంజూరు చేసి రూ.10,194 కోట్లు ఖర్చు చేసి 8.04 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఇంటికి రూ.50 వేల, గిరిజనులకు రూ.75 వేల చొప్పున మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో 18.61 లక్షల ఇళ్లు మంజూరైనా, రూ.9,588 కోట్లు ఖర్చు చేసి కేవలం 6.70 లక్షల ఇళ్లే పూర్తయ్యాయని విమర్శించారు. అలాగే గతంలో మంజూరై లబ్ధిదారులు స్వంత నిధులతో నిర్మాణాలు ప్రారంభించిన 4.36 లక్షల ఇళ్లను రద్దు చేయడం వల్ల పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన 20.29 లక్షల ఇంటి స్థలాల్లో ఇంకా 12.39 లక్షల స్థలాల్లో గృహాలు మంజూరు కావాల్సి ఉందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణ కార్యక్రమాలకు వేగం పెరిగిందని మంత్రి తెలిపారు. పీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ్, పీఎం-జన్‌మన్ పథకాల కింద మొత్తం 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు రూ.2,102 కోట్లు ఖర్చు చేసి 4.56 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. కొత్తగా వచ్చిన 10.42 లక్షల దరఖాస్తుల్లో పరిశీలన అనంతరం 9.50 లక్షల మంది అర్హులను గుర్తించామని, తొలి విడతగా కేంద్రం 74,812 ఇళ్లు మంజూరు చేసిందన్నారు.
పీఎంఏవై అర్బన్ 2.0 కింద యూనిట్ ధర రూ.2.50 లక్షలుగా నిర్ణయించగా, కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్రం రూ.1 లక్ష అందిస్తాయని తెలిపారు. గ్రామీణ పథకంలో కేంద్రం, రాష్ట్రం ఆర్థిక సహాయంతో పాటు వడ్డీలేని రుణాలు, ఎన్ఆర్ఈజీఎస్ మద్దతు కూడా లభిస్తాయని చెప్పారు. గృహ నిర్మాణాల వేగవంతానికి 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను కేటాయించామని, పోలవరం పునరావాస గృహాల నిర్మాణాన్ని కూడా గృహ నిర్మాణ శాఖే పూర్తి చేస్తుందని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు.
