



ప్రజల విశ్వాసమే నన్ను సీఎంగా నిలబెట్టింది: రేవంత్ రెడ్డి
గడిచిన 20 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఏనాడూ నేను సెలవు తీసుకోలేదు. ప్రజలు నాకిచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకగా మారి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశాను. అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు ప్రగతిని పరిగెత్తిస్తున్నాం. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధిగా తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి శనివారం తన రాజకీయ జన్మభూమి అయిన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 47.08 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ ‘కృతజ్ఞత సభ’లో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2006 జులై 4వ తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రంపై మిడ్జిల్ ప్రజలు ఒక సరికొత్త చరిత్రను లిఖించారని కొనియాడారు. నాడు జెడ్పీటీసీగా సాధించిన గెలుపు నాది కాదు, మిడ్జిల్ మండల ప్రజలది. ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడింది. ఈ మారుమూల ప్రాంత ప్రజలు నాడు తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే నేడు ఒక పల్లెటూరి బిడ్డకు రాష్ట్ర అత్యున్నత పీఠం దక్కింది. అందుకే ఈ గడ్డకు, ఇక్కడి ప్రజలకు నా ప్రాణమిచ్చినా తక్కువే అని సీఎం భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా పాలమూరు గడ్డ అందించిన మహోన్నత నాయకులను ఆయన స్మరించుకున్నారు. నిజాం సర్కార్ పాలన నుంచి విముక్తి లభించాక హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావుని, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన కీర్తిశేషులు జైపాల్ రెడ్డిని, ఆయనను ప్రోత్సహించిన గుడియాన్ పల్లి వాసి ద్యాప గోపాల్ రెడ్డిని, అలాగే ఆదర్శ నేత మహేంద్రనాథ్ని సీఎం శ్లాఘించారు. ఈ పర్యటనలో భాగంగా మిడ్జిల్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు సీనియర్ నాయకుడు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు.
చీకటి నుంచి వెలుగుల వైపు.. మండలాన్ని దత్తత తీసుకోవాలి
ఆనాటి వెనుకబాటుతనాన్ని గుర్తుచేస్తూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిడ్జిల్ మండలంతో పాటు గద్వాల్ నియోజకవర్గంలోని గట్టు మండలాన్ని ‘డార్క్ ఏరియాలు’గా (అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా) ప్రభుత్వాలు ప్రకటించాయని సీఎం వివరించారు. నాట రోడ్లు, విద్య, వైద్యం, సాగు, తాగునీరు లేక ప్రజలు వలసలు వెళ్లేవారన్నారు. ఇకపై మిడ్జిల్ కరవుతో అల్లాడే చీకటి ప్రాంతం కాదు. ఇది అన్ని వసతులతో కూడిన వెలుగుల మండలంగా ప్రభుత్వ రికార్డుల్లోకెక్కాలి. ఇక్కడి ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షించారు. ఈ మండలాన్ని అన్ని విధాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు గాను దీన్ని దత్తత తీసుకోవాల్సిందిగా వేదికపైనే ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని సీఎం కోరారు.
రైతు బిడ్డగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం
తాను పల్లెటూర్లోనే పుట్టి పెరిగానని, పేదవాడి కష్టాలు, కులమతాల నడుమ ఉండే బంధాలు తనకు బాగా తెలుసని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాకు వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం, విత్తనం వేయడం తెలుసు. భూమికి-విత్తనానికి ఎలాంటి బంధం ఉంటుందో, పాలకుడికి-ప్రజలకు మధ్య అలాంటి అవగాహనే ఉండాలి. భారతదేశమంటే ఎక్కడో లేదు.. లక్షలాది గ్రామాల కలయికే దేశం. పల్లెలు బాగుపడితేనే మండలాలు, జిల్లాలు, తద్వారా రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఉప కులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, అలాగే వందేళ్లలో ఎన్నడూ జరగని విధంగా వెనుకబడిన తరగతుల (బీసీ) కులగణనను పూర్తి చేశామని తెలిపారు. కేవలం లెక్కలు తేల్చడమే కాకుండా, వారి వాటాను వారికి అందించి సామాజిక న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు.
ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి రూ. 47.08 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఊరుకొండపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు, పాత మిడ్జిల్ మండల పరిధిలోని 40 గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించారు. మండలాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఈ గ్రామాల్లో 24 మిడ్జిల్ మండలంలో, 16 ఊరుకొండ మండలంలో ఉన్నాయి. అదనంగా రూ.17.08 కోట్లతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భైరాంపల్లి సమీపంలోని దుంధుబి వాగు, వడియాల్ సమీపంలోని చిన్నవాగు, వస్పుల గ్రామం వద్ద వస్పుల కత్వా పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండపేటలోని శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.
పాత మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం
ముఖ్యమంత్రి రాకతో ఉరుకొండపేట, మిడ్జిల్ గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. స్వామివారి దర్శనానంతరం, ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. 20 ఏళ్ల క్రితం తాను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు తనతో పాటు పనిచేసిన ఆనాటి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వృద్ధులు, రాజకీయ సహచరులను రేవంత్ రెడ్డి ఎంతో అప్యాయంగా పలకరించారు. ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కొందరు పాత మిత్రులు 20 ఏళ్ల నాటి అరుదైన ఫోటోలను చూపించగా, సీఎం వాటిని చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
