

వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి: డీజీపీ సీవీ ఆనంద్
ప్రస్తుత వర్షాకాలంలో భారీ వర్షాలు, నీటి నిల్వ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ అత్యున్నత స్థాయిలో సన్నద్ధంగా ఉందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. నగరంలో నీరు నిలవడం, పట్టణ వరదలు, ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి చేపడుతున్న ముందస్తు చర్యలపై మంగళవారం ఒక అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
నీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వర్షాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు నీటిమునిగే ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గాలను గుర్తించి, ఆ సమాచారాన్ని సకాలంలో ప్రజలకు చేరవేయడం ఎంతో ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.
నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు ఇతర కీలక ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొన్నారు. అత్యవసర రెస్పాన్స్ యంత్రాంగాన్ని ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలి. భారీ వర్షాల వల్ల ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా పోలీస్ బృందాలు తక్షణమే స్పందించేలా ఉండాలని డీజీపీ అన్నారు. వరదలను సమర్థవంతంగా నిర్వహించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి పోలీస్, నీటి పారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య సన్నిహిత సమన్వయం చాలా అవసరం. అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ, సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి, ఆలస్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వర్షాకాలంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి లేదా అలసత్వానికి తావుండకూడదని, ప్రజా రక్షణే అత్యున్నత ప్రాధాన్యతగా పనిచేయాలని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ యూనిట్లు వర్షాకాలం ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాల ఏర్పాటు
నగరంలోని మల్కం చెరువు, ఖాజాగూడ చెరువు, మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ ప్రాంతంలోని చెరువులు, బయోడైవర్సిటీ జంక్షన్ పరిసర ప్రాంతాలు, కొండాపూర్ వంటి వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సమీక్షలో వెల్లడించారు. ఈ బృందాలు నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనేజీ అనుసంధానం, నీరు నిలవడానికి దారితీస్తున్న ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తాయి. భూగర్భ పరిశీలన పూర్తి చేసి, నీటి నిల్వ సమస్యలకు తక్షణ నివారణ చర్యలతో పాటు, దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాలను సూచిస్తూ నివేదికలు సమర్పిస్తాయని తెలిపారు.
కాగా, వర్షాకాలం మొత్తం అధికారులు హై అలర్ట్‌లో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారమే ఆదేశించిన సంగతి తెలిసిందే. జూన్ 9న హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) లో కురిసిన భారీ వర్షాల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. సైబరాబాద్ సహా పలు ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్ జామ్‌ల కారణంగా నగర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ప్రజలను అలర్ట్ చేయడంలో విఫలమైనందుకు మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ విభాగాల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.
