
సెల్ఫ్-ఎన్యూమరేషన్‌లో ప్రజలు చురుగ్గా పాల్గొనాలి: జేసీ ఇలక్కియా
2027 జనగణన తొలి దశలో భాగంగా ప్రారంభించిన స్వీయ-ఎన్యూమరేషన్ ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని విజయవాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో ప్రతి కుటుంబం తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. దేశ ప్రగతికి మార్గదర్శకంగా నిలిచే జనగణన విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు.
సెల్ఫ్-ఎన్యూమరేషన్‌పై అవగాహన పెంచేందుకు జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో నగరంలో 5కే పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా సెల్ఫ్-ఎన్యూమరేషన్ జేడీ ప్రసన్న కుమార్ కలిసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, యువత పాల్గొని జనగణన ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఇలక్కియా మాట్లాడుతూ జనగణన చరిత్రలో తొలిసారిగా స్వీయ-ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే ఈ విధానం ద్వారా ఖచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని తప్పిదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రజలు అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.in ద్వారా సులభంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు ఫీల్డ్ సర్వే సమయంలో అధికారులు త్వరగా ధృవీకరణ చేయగలరని వివరించారు.
స్వీయ-ఎన్యూమరేషన్ ద్వారా భవనం సంఖ్య, కుటుంబ సభ్యుల సంఖ్య, గృహ యాజమాన్య స్థితి, తాగునీటి వనరు, ఇంటర్నెట్, టీవీ వంటి సౌకర్యాలు సహా మొత్తం 34 అంశాలపై ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఈ వివరాలు సమగ్ర ప్రణాళికల రూపకల్పనలో ప్రభుత్వానికి కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
జనగణన అనేది దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వివరాలను సేకరించే సమగ్ర ప్రక్రియ. ఈ డేటా పాలకులు, పరిపాలకులు, పరిశోధకులకు ముఖ్య ఆధారంగా నిలుస్తుంది. కాగా అధునాతన డిజిటల్ సాంకేతికతల సహాయంతో ఈసారి జనగణనను మరింత వేగంగా ఖచ్చితంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డేటా భద్రతకు అత్యున్నత ప్రమాణాలు పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే జనగణన రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశగా హౌస్ లిస్టింగ్, హౌసింగ్ జనగణన 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంలో 30 రోజులపాటు జరుగుతుంది. ఫీల్డ్ వర్క్‌కు ముందు 15 రోజులపాటు స్వీయ-ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. ఈ దశలో ఇంటి పరిస్థితులు, సౌకర్యాలు, ఆస్తులపై సమాచారం సేకరిస్తారు.
రెండో దశగా జనాభా లెక్కింపు 2027 ఫిబ్రవరిలో చేపడతారు. ఇందులో జనాభా సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, వలసలు, జననాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. లడాఖ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మంచు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రక్రియను 2026 సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు.
