Let's talk: editor@tmv.in
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
13 జూన్, 2026

రెండేళ్ల క్రితం 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక సాధారణ రాజకీయ గెలుపు కాదు... అహంకారంపై సామాన్యుడు సంధించిన ఒక బలమైన సందేశం. భయాన్ని, అధికార గర్వాన్ని, అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించార‌ని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా దామినీడు గ్రామం వేదికగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి వెంకట మణిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. ప్రజలు మనకిచ్చింది కేవలం అధికారం కాదు, రాష్ట్రాన్ని కాపాడి ప్రగతిపథంలో నడిపించే ఒక గొప్ప బాధ్యత అని స్పష్టం చేశారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన 21 సీట్లకు పరిమితమై చేసిన త్యాగానికి ప్రజలు 100 శాతం స్ట్రయిక్ రేట్‌తో చారిత్రాత్మక విజయాన్ని అందించారని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించి మాజీ పీఎం నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని నరేంద్ర మోడీకి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

గతంలో తాము ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ఆచరణలో పెడుతున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. పెరిగిన వృద్ధాప్య పింఛన్లు, మహిళల ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అండగా ‘అన్నదాత సుఖీభవ’, అన్నా క్యాంటీన్లు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

పంచాయతీరాజ్ బలోపేతం

మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం, డాక్టర్ బి.ఆర్. ఆంబేద్కర్ ఆశయాల సమాహారమే నేటి ప్రధాని మోడీ "సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" పాలనా తత్వమని కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మాట్లాడుతున్నానని పేర్కొంటూ.. దేశ భవిష్యత్తు గ్రామాల్లోనే నిర్ణయించబడుతుందని స్పష్టం చేశారు. అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదని, ప్రజల దగ్గరకు తీసుకువెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యమని చెప్పారు. స్థానిక సంస్థలను బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేమన్నారు.

గత రెండేళ్లలో మేము గ్రామాల్లో నిర్మించింది కేవలం రోడ్లు, భవనాలు కాదు.. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం. వ్యవస్థపై విశ్వాసం తగ్గితే సమాజం కులాలు, ప్రాంతాలుగా ముక్కలవుతుంది. మనమంతా కుల, ప్రాంతీయ పరిమితులు దాటి భారతీయత వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబులిటీ విడిపోతే వ్యవస్థలు కుప్పకూలుతాయన్నారు. సమస్య కేవలం నిధుల కొరత మాత్రమే కాదు, బాధ్యతలపై స్పష్టత లేకపోవడమేనన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ చల్లేందుకు, జెండా పండుగ చేయడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయని, వేల కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం వెతకాలని, నిర్ణయాలు ఆఫీసుల్లో కాదు ప్రజల సమక్షంలోనే జరగాలని స్పష్టం చేశారు. గ్రామసభ బలపడితేనే పంచాయతీ బలపడుతుందని, అప్పుడే ప్రతి చిన్న సమస్య ఎమ్మెల్యే టేబుల్ మీదకు రాకుండా, వారు రాష్ట్ర భవిష్యత్తుపై, పరిశ్రమల రాకపై దృష్టి పెట్టగలరన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది కేవలం స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు, అది బలమైన నాయకులను తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మున్సిపల్ కౌన్సిలర్ గానే తన ప్రయాణాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. 50 శాతం మహిళా రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు సామాజిక, ఆర్థిక నాయకత్వాన్ని చేపడుతున్నారన్నారు.

కూటమి ప్రభుత్వం సాధించిన స్థిరత్వంతో 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లామన్నారు. 'పల్లె పండుగ'ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చామని, 'స్వర్ణ పంచాయతీ' దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా తిరుపతి జిల్లా శ్రీనివాసపురం పంచాయతీని ప్రస్తావించారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలను డిజిటలైజ్ చేసి, ఒక్క రూపాయి పన్ను పెంచకుండానే పంచాయతీ ఆదాయాన్ని రూ. 75 లక్షల నుంచి రూ. 1.66 కోట్లకు పెంచగలిగామని వివరించారు.

రాబోయే తరాల కోసం నిర్ణయాలు

2047 నాటికి 'వికసిత్ భారత్' నిర్మాణం పార్లమెంట్ భవనం నుంచి కాదు, దేశంలోని 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీల కంటే వ్యవస్థలను, వ్యక్తుల కంటే విలువలనూ నమ్మినప్పుడే ప్రజాస్వామ్యం శాశ్వతమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కేవలం వచ్చే ఎన్నికల కోసం కాదు.. రాబోయే తరాల కోసం. రాబోయే తరాలు గర్వించే ఉజ్వల సమాజాన్ని నిర్మించడమే మన కూటమి ప్రభుత్వ సమష్టి బాధ్యత అని పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు.

ఈ సభలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్,కందుల‌ దుర్గేష్ , ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.