Let's talk: editor@tmv.in
ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
2 జులై, 2026

రాష్ట్ర బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలంటే ఆదాయ సమీకరణపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయంలో ఎలాంటి లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆదాయ వసూళ్ల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణ అంశంపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ సంస్థలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ వంటి సంస్థల ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర శాఖల్లోనూ ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టాలని స్పష్టం చేశారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అధికారులను హెచ్చరించారు.

శాఖలవారీగా పనితీరును మెరుగుపరచి, సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించిన సీఎం, పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన విధంగా బడ్జెట్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ప్రాజెక్టుల అమలులో భూసేకరణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించే బడ్జెట్ ఊహాగానాలపై కాకుండా వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాఖలకు అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంటూ, సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్‌లు
TelanganaTelanganaGovernmentBudget2026RevenueCollectionCMRevanthReddyRevanthReddyHyderabadGovernancePublicFinanceHMDA
ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku