Let's talk: editor@tmv.in
కోటీశ్వరులను కాదు.. ముందు అంగన్‌వాడీలకు జీతాలివ్వండి: మాజీ మంత్రి హరీష్ రావు

కోటీశ్వరులను కాదు.. ముందు అంగన్‌వాడీలకు జీతాలివ్వండి: మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
11 జూన్, 2026

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయమాటలతో మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టోను తన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిజమైన గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు అంగన్‌వాడీలకు బకాయి ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62 వేల మంది అంగన్‌వాడీ సోదరీమణుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. సాటి మహిళల కన్నీటి గోసను మహిళా మంత్రిగా ఉన్న సీతక్క కూడా అర్థం చేసుకోకపోవడం బాధాకరమన్నారు.

బీఆర్ఎస్ హయాంలో అంగన్‌వాడీల వేతనాలు

బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అంగన్‌వాడీ వర్కర్లను టీచర్లుగా గుర్తించి వారి గౌరవాన్ని పెంచిందని, 2014లో రూ.4,200 మాత్రమే ఉన్న టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, హెల్పర్ల వేతనాన్ని రూ.7,800లకు పెంచినట్లు పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లించిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌దేనని ఆయ‌న అన్నారు.

హామీలు ఎటు పోయాయి?

ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ. 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తెచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని.. కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ హామీకి అతీ గతీ లేదని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం 'ఛలో సెక్రెటేరియట్' పిలుపునిచ్చిన అంగన్‌వాడీలపై పోలీసులను ప్రయోగించి క‌ఠినంగా వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీల వేతనాలను, అలాగే అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్‌వాడీలకు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.