Let's talk: editor@tmv.in
పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: తెలంగాణ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్టే!

పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: తెలంగాణ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్టే!

Gaddamidi Naveen
16 ఏప్రిల్, 2026

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు పాస్‌పోర్ట్ వివాదం కేసులో లభించిన ఊరటపై సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన వారం రోజుల 'ట్రాన్సిట్ ముందస్తు బెయిల్' ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్టే విధించింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రనికి భుయాన్ శర్మ దాఖలు చేసిన కేసులో పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.

తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 10న ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ, దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరాకు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ పవన్ ఖేరా అస్సాంలోని సంబంధిత అధికార పరిధి ఉన్న కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, నేటి సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు దానికి అడ్డంకి కావని ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం

అస్సాం సీఎం భార్య రనికి భుయాన్ శర్మకు భారత్, యూఏఈ, ఈజిప్ట్ దేశాలకు చెందిన మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని, దుబాయ్, అమెరికాలో అక్రమ ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. ఈ ఆరోపణలను శర్మ కుటుంబం తీవ్రంగా ఖండించింది. ఖేరా చూపించిన పత్రాలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ పత్రాలు అని, పాకిస్థానీ సోషల్ మీడియా గ్రూపులు వీటిని సర్క్యులేట్ చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.

రాజకీయ దుమారం

ఈ వివాదంపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. ఆరోపణలు చేసే ముందు విదేశాంగ మంత్రిని అడగాల్సింది. అస్సాం పోలీసులు నిందితులను పాతాళం నుంచి అయినా వెతికి పట్టుకొస్తారు అని హెచ్చరించారు. ఈ వ్యవహారం వెనుక రాహుల్ గాంధీ హస్తం ఉందని, అందుకే ఈ కేసు దర్యాప్తు రాహుల్ గాంధీ వరకు వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఖేరా అస్సాం కోర్టును ఆశ్రయించాల్సి ఉండగా, ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది.