
పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. మోడీ సహా ప్రముఖుల పరామర్శ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం జరిగిన అధికారిక సమావేశంలో అకస్మాత్తుగా అస్వస్థత కలగడంతో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్ సహా పలు వైద్య పరీక్షల నివేదికల ఆధారంగా శస్త్రచికిత్స అనివార్యమని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఆయనకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో పాటు పరిపాలనా సమావేశాల సమయంలో ఎదురైన తీవ్రమైన అసౌకర్యానికి చికిత్సగా ‘ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ’ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ కనీసం వారం నుంచి పది రోజుల పాటు సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించింది. ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వైద్య పర్యవేక్షణ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ పరామర్శ
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యవంతులు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని నమ్ముతున్నాను. ఆయన క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను అని ప్రధాని పేర్కొన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మద్దతు, మార్గదర్శకత్వం తనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రజా సేవలో మళ్ళీ చురుగ్గా పాల్గొనాలని కోరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ తన శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొద్ది రోజుల పాటు పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోనున్నారు.
