

పచ్చదనం కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి పవన్ కళ్యాణ్ శ్రీకారం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులోని బటర్ ఫ్లై పార్క్ లో శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏకంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన స్వయంగా విత్తన బంతులను తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ ను రూపొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు
ఈ పర్యావరణ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించారు. మూలపాడు బటర్ ఫ్లై పార్క్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ వీక్షించారు. వివిధ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయా రీలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించి, ఏయే విత్తనాలు వాడుతున్నారు, ఎంత మొత్తంలో తయారు చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన సంరక్షణకు కృషి చేసిన మహనీయుల స్ఫూర్తితో ఈ విత్తన బంతుల తయారీని ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జూన్ 15వ తేదీ నాటికి నిర్దేశిత 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, డ్రోన్ల సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులను వెదజల్లే ప్రక్రియను ఆయన ఆసక్తిగా పరిశీలించారు.
అంతకుముందు అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి, బటర్ ఫ్లై పార్కు నమూనాలో ఉన్న యోగా హాల్ నిర్మాణాన్ని అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్‌ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కొండపల్లి కొయ్య బొమ్మల తయారీకి వాడే తెల్ల పొణికి దుంగలను, ఉదయగిరి కళాకారులు వేప కర్రతో తయారు చేసిన వంట సామాగ్రి, చెక్క వాచ్, ల్యాప్‌టాప్ వంటి కళాకృతులను ఆయన ఆసక్తిగా తిలకించారు. బొమ్మల తయారీకి చెక్క కొరత ఉందని చిత్తూరు కళాకారులు తెలపడంతో, రాష్ట్రంలో ‘వుడ్ బ్యాంక్’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రతిమను కొయ్య బొమ్మల కళాకారుల చేత తయారు చేయించాలని కోరారు. ఈ అద్భుత కళారూపాలకు మంచి మార్కెటింగ్, ప్రచారం కల్పిస్తానని హామీ ఇస్తూ, ప్రతి రెండు నెలలకోసారి చేతివృత్తుల కళాకారులను కలిసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అటవీ పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
