Let's talk: editor@tmv.in
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ సమీక్ష

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ సమీక్ష

Panthagani Anusha
26 మే, 2026

రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలను 'కాలుష్యరహిత పుష్కరాలు నిర్వహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించి పుష్కరాల ఏర్పాట్లతో పాటు గోదావరి నది జలాల కాలుష్య పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలో గోదావరి నదిలో ప్రయాణిస్తూ ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను నదీ తీర ప్రాంతాల్లోని కాలుష్య తీవ్రతను ఆయన స్వయంగా అంచనా వేశారు.

తీర ప్రాంత పరిశీలన అనంతరం నల్లా ఛానల్ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్‌ను ఉప ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా నగరంలోని నల్లా ఛానల్ నుంచి నేరుగా గోదావరిలోకి కలుస్తున్న కాలుష్యకారక వ్యర్థాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానిక పేపర్ మిల్లు నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలను ఎక్కడ, ఎలా శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) చైర్మన్ శ్రీకృష్ణయ్యను ప్రశ్నించారు. రోజువారీ మురుగునీటిని శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేస్తున్నారా లేదా అని అధికారులను ఆరా తీశారు.

రాజమహేంద్రవరం నగరంలోని గృహాల నుంచి రోజువారీగా సుమారు 55 మిలియన్ లీటర్ల (ఎం.ఎల్.డి.) మురుగునీరు విడుదలవుతుండగా అందులో కేవలం 15 శాతం మాత్రమే ప్రస్తుతం ఉన్న సీవరేజ్ ప్లాంట్ల ద్వారా శుద్ధి అవుతోందని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన మురుగునీరు నేరుగా నదిలోకి చేరుతోందని వివరించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అత్యంత పారదర్శకంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. నగర మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసిన తర్వాతే గోదావరి నదిలోకి వదిలేలా శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు పుష్కరాల ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, గోదావరి గట్ల పటిష్ఠీకరణ, సుందరీకరణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్ ఉప ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు వేగవంతం చేయాలని, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.