
శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం పై పవన్ కళ్యాణ్ ఆరా
తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అటవీ సంపదకు భారీ నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ, మంటలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు.
శనివారం తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో బయోట్రిమ్ వెనుక భాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనపై పి.వి.చలపతిరావు సహా అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షించారు. మంటలు మరింత విస్తరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, వీలైనంత త్వరగా పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
అగ్నిప్రమాదానికి కొంతమంది గంజాయి, మద్యం సేవించిన ఆకతాయిలే కారణమన్న అనుమానాల నేపథ్యంలో ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి అరెస్టు చేయాలని అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పీసీసీఎఫ్ నుంచి వివరణ తీసుకోవాలని అధికారులను సూచించారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే యాంటి ఫైర్ స్క్వాడ్‌కు చెందిన 20 మంది సిబ్బంది, పోలీసులు, టీటీడీకి చెందిన మరో 10 మంది సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అటవీ అధికారులు తెలిపారు. మంటలు ఆదివారం మధ్యాహ్నం నాటికి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వేసవి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాంటి రెడ్ శాండర్స్ స్క్వాడ్ కూంబింగ్ సమయంలో అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.
అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రజల భాగస్వామ్యంతో అగ్నిప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని సూచించారు. జనసమ్మర్ధం ఉండే అటవీ మార్గాల్లో మఫ్టీలో అటవీ సిబ్బంది, పోలీసులను నియమించి ఆకతాయిల కదలికలపై నిఘా పెంచాలని తెలిపారు.
అపరిచితులు అటవీ ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తే గ్రామస్తులే అడ్డుకునేలా అవగాహన కల్పించాలని అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణం స్పందించేలా ప్రజలను సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించే పరిస్థితుల్లో సిబ్బంది చేరుకునేలోపు మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు మార్గదర్శకాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
