Let's talk: editor@tmv.in
పటాన్‌చెరు 200 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: ఎమ్మెల్సీ అంజి రెడ్డి
పటాన్‌చెరు 200 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: ఎమ్మెల్సీ అంజి రెడ్డి

పటాన్‌చెరు 200 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: ఎమ్మెల్సీ అంజి రెడ్డి

Gaddamidi Naveen
24 మే, 2026

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై అక్కడ చికిత్స పొందుతున్న వారితో ఆయన నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రి నిర్వహణపై మరింత శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. తెలంగాణ వైద్య విధాన పరిషత్ జీవో నెం.82 (16-07-2022) ద్వారా పటాన్‌చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.184 కోట్లు మంజూరయ్యాయని గుర్తుచేశారు. ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తై సంవత్సరం గడిచినా, ఆరోగ్య శాఖకు అప్పగించి నెలలు అవుతున్నా ఆసుపత్రిని ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

15 రోజుల్లోగా ప్రారంభించకుంటే ముట్టడి

పరిశ్రమల కాలుష్య ప్రభావంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పటాన్‌చెరు ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో అవసరమని, కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారిందని అంజి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా సంగారెడ్డి జిల్లాలోనే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పటికీ, ఈ ఆసుపత్రి ప్రారంభం కాకపోవడం బాధాకరమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో కుమ్మక్కై దీని ప్రారంభాన్ని ఆలస్యం చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, వెంటనే అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. రాబోయే 15 రోజుల్లోగా ఆసుపత్రిని ప్రారంభించకపోతే డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయ‌న‌ హెచ్చరించారు.