Let's talk: editor@tmv.in
చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి రైతుకు పరిహారం చెల్లించాలి:బాంబే హైకోర్టు

చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి రైతుకు పరిహారం చెల్లించాలి:బాంబే హైకోర్టు

Panthagani Anusha
27 ఏప్రిల్, 2026

వన్యప్రాణుల వల్ల పంట నష్టం సంభవిస్తే రైతులకు పరిహారం చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. చిలుకలు (రోజీ పాస్టర్) దాడి వల్ల దానిమ్మ తోటను నష్టపోయిన ఒక రైతుకు పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కీలక తీర్పు వెలువరించింది. కేవలం కొన్ని రకాల అడవి జంతువుల వల్ల కలిగే నష్టానికే పరిహారం పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది.

ప్రభుత్వ ఆస్తికి బాధ్యత ప్రభుత్వానిదే

వార్ధా జిల్లా హింగి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు మహాదేవో డేకాటే తన దానిమ్మ తోటలో చిలుకలు దాడి చేసినందున రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని 2016లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ ఉర్మిళా జోషి-ఫాల్కే, జస్టిస్ నివేదితా మెహతా ధర్మాసనం ఏప్రిల్ 24న ఈ తీర్పును ఇచ్చింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) ప్రకారం వన్యప్రాణులన్నీ ప్రభుత్వ ఆస్తి అని అందులో చిలుకలు కూడా భాగమేనని కోర్టు గుర్తు చేసింది. పౌరులు వన్యజీవులను రక్షించాల్సిన బాధ్యత కలిగి ఉన్నప్పటికీ వాటి వల్ల కలిగే వ్యక్తిగత నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

సమానత్వ హక్కు ఉల్లంఘనే

సాధారణంగా ఏనుగులు, అడవి పందులు లేదా పులుల వంటి పెద్ద జంతువుల వల్ల నష్టం జరిగితేనే ప్రభుత్వం పరిహారం ఇస్తుంటుంది. అయితే దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. "నిర్దిష్ట జాతుల జంతువుల వల్ల కలిగే నష్టానికే పరిహారం ఇస్తామనడం సమానత్వ హక్కుకు (ఆర్టికల్ 14) విరుద్ధం. వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది ప్రభుత్వ నిర్ణయాల కంటే పైచేయి కలిగి ఉంటుంది అని కోర్టు వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయి పరిశీలనలో రైతు తోటలో 50 శాతం పంట చిలుకలు వల్ల పాడైందని తేలినప్పటికీ నిబంధనలు లేవనే సాకుతో పరిహారం నిరాకరించడాన్ని కోర్టు తప్పుపట్టింది.

రైతులకు రక్షణ లేకుంటే వన్యప్రాణులకే ముప్పు

ఒకవేళ రైతులకు తమ నష్టానికి తగిన పరిహారం అందకపోతే వారు తమ పంటలను కాపాడుకునేందుకు వన్యప్రాణులకు హాని చేసే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది. ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నష్టపోయిన 200 దానిమ్మ చెట్లకు గాను ఒక్కో చెట్టుకు రూ.200 చొప్పున రైతుకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు భవిష్యత్తులో వివిధ రకాల వన్యప్రాణుల వల్ల పంటలు నష్టపోయే రైతులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా నిపుణులు భావిస్తున్నారు.