Let's talk: editor@tmv.in
పేపర్ లీక్ ఆరోపణలు.. నీట్-యూజీ 2026 రద్దు

పేపర్ లీక్ ఆరోపణలు.. నీట్-యూజీ 2026 రద్దు

Laaheerie P
13 మే, 2026

ఈ నెల‌ 3న నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-యూజీ 2026)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారికంగా రద్దు చేసింది. పరీక్షా పత్రం లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో, పరీక్షా వ్యవస్థపై పారదర్శకత, నిష్పక్షపాతత, ప్రజల్లో నమ్మకాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

మళ్లీ పరీక్ష.. ఫీజు లేదు

రద్దు చేసిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని, అయితే తిరిగి రాసే అభ్యర్థులు కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం గానీ, అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం గానీ లేదని స్పష్టం చేసింది. దాదాపు 23 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది.

పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. డిజిటల్ ఆధారాలు, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, రాష్ట్రాల మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాలపై సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సహా పలు రాష్ట్ర సంస్థలు కూడా ఈ దర్యాప్తులో సహకరిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రశ్నాపత్రం నిజంగా లీక్ అయ్యిందనే నిర్ధారిత ఆధారాలు దొరకలేదని, సోషల్ మీడియాలో వైరల్ అయిన మెటీరియల్ అసలు ప్రశ్నాపత్రానిదేనా లేదా అంచనాల ఆధారంగా రూపొందించిందా అన్న కోణంలో విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

నీట్ రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు పరీక్షా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పదేపదే జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీక్‌లతో విద్యార్థుల్లో ప్రభుత్వ పరీక్షలపై నమ్మకం దెబ్బతింటోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలను ముమ్మరం చేశాయి. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని శాస్త్రి భవన్ సమీపంలో నిరసనలు నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ మధ్య 23 లక్షల మంది అభ్యర్థులకు నిర్వహించిన ఈ పరీక్ష, ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండటంతో పాటు, మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే స్పష్టత లేకపోవడంతో లక్షలాది మంది వైద్య ఆశావహులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.