
గత ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తి కాలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్
ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆ ప్రాంతానికి జరిగిన చారిత్రాత్మక అన్యాయాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దేవాదుల, ఎస్.ఎల్.బి.సి, సీతారామ ప్రాజెక్టులతో సరిసమానంగా పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి, సమృద్ధిగా సాగునీరు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే వారు ఈ అబద్ధాలు చెపుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు 'ఆఫ్ టేక్' పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు మార్చడం వల్ల జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కనీసం భూసేకరణ కూడా జరపకుండానే, గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ నెట్ వర్క్‌కు టెండర్లు పిలిచి బాధ్యతారహితంగా చేతులు దులుపుకుందని ఆయన ఎద్దేవా చేశారు.
12.30 లక్షల ఎకరాలకు సాగునీరు
ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి తొలి దశలో నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు, అనుబంధ ప్రాజెక్టులను పూర్తి చేసి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తేల్చిచెప్పారు.
జూరాల పూడికతీతకు ‘డ్రిప్’ ప్రతిపాదనలు
పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోవడం వల్ల జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 8 టీఎంసీల దిగువకు పడిపోయిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జూరాలలో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని, రిజర్వాయర్ భద్రతను, నిర్వహణను మెరుగుపరిచేందుకు వీలుగా డ్యామ్ పునరావాసం, అభివృద్ధి ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. అలాగే, వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే చిన్న తరహా సాగునీటి చెరువులలో పూడిక తీత పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు మరో 15 రోజుల్లో మళ్లీ ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈలోగా ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
