
సీఎం పర్యటనతో పాలమూరుకు ఒరిగేదేమీ లేదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన వల్ల జిల్లా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో జిల్లాకు ఏవైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారని, కానీ నిలిచిపోయిన పనులకు నిధులు ఇవ్వకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పలేకపోయారన్నారు. కాలువలు, టన్నెళ్లు, మోటర్లు, పంపు హౌస్‌లు, రిజర్వాయర్లు నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమేనని.. అందులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులో రూ. 33,500 కోట్ల మేర పనులు పూర్తి చేస్తే, కేవలం కొన్ని పెండింగ్ బిల్లులు ఇచ్చి తామే పనులు చేశామని చెప్పుకోవడం సరికాదన్నారు. ప్రాజెక్ట్ జాప్యానికి కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులే కారణమని ఆరోపించారు.
సొంత జిల్లాకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. ఆదిత్యనాథ్ అనే అధికారిని తీసుకువచ్చి తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, రైతులు, సామాన్యులు ఏ ఒక్కరూ కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగా లేరని, మోసపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని, తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
