Let's talk: editor@tmv.in
పవర్‌ప్లేలో పేసర్ల పంజా.. ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ
పవర్‌ప్లేలో పేసర్ల పంజా.. ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ
పవర్‌ప్లేలో పేసర్ల పంజా.. ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ

పవర్‌ప్లేలో పేసర్ల పంజా.. ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ

Shaik Mohammad Shaffee
28 ఏప్రిల్, 2026

ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో ఆర్సీబీ పేసర్లు పవర్ ప్లేలోనే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని జోష్ హేజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్ తమ స్పెల్స్‌తోవణికించారు. దీంతో కేవలం 75 పరుగులకే ఢిల్లీ కుప్పకూలగా.. స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోకుండా ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది.

13 పరుగులకే 6 వికెట్లు!

మ్యాచ్ ఆరంభమైన మొదటి మూడు ఓవర్లలోనే ఢిల్లీ పతనం ఖాయమైంది. ఇన్నింగ్స్ రెండో బంతికే భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్-స్వింగర్ యార్కర్‌కు డెబ్యూ ప్లేయర్ సాహిల్ పరాఖ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జోష్ హేజిల్‌వుడ్‌ తన విశ్వరూపం చూపించాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో కె.ఎల్. రాహుల్ (1)తో పాటు సమీర్ రిజ్వీ (0)ని వరుస బంతుల్లో ఔట్ చేసి స్టేడియాన్ని నిశ్శబ్దంలో ముంచెత్తాడు. అనంతరం భువీ వేసిన స్వింగర్లకు స్టబ్స్ (5), కెప్టెన్ అక్షర్ పటేల్ (0) వికెట్ కీపర్ చేతికి చిక్కారు. నితీష్ రాణా (1) కూడా హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో, ఢిల్లీ జట్టు 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆరంభాన్ని మూటగట్టుకుంది.

పోరెల్ పోరాటం

ఒక దశలో ఐపీఎల్ కనిష్ట స్కోరు (49 పరుగులు) దాటడం కూడా కష్టమే అనిపించినా, అభిషేక్ పోరెల్ (30), డేవిడ్ మిల్లర్ (19) కాసేపు పోరాడి జట్టు స్కోరును 75 పరుగులకు చేర్చారు. కైల్ జేమీసన్ 12 పరుగులు చేశాడు. హేజిల్‌వుడ్‌ 4 వికెట్లు, భువీ 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీ టీమ్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. గత మ్యాచ్‌లో 264 పరుగులు చేసిన ఢిల్లీ బ్యాటర్లు, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి కనీసం ఎదురుదాడి చేయలేక చేతులెత్తేశారు.

విరాట్ ఫినిషింగ్ టచ్.. ఆర్సీబీ విక్టరీ

76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ (23), జాకబ్ బెథెల్ (20) చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. బెథెల్ అవుట్ అయినప్పటికీ, దేవదత్ పడిక్కల్ (34 నాటౌట్) వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన సొంత గడ్డపై ఆడుతున్న లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ, నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ బ్యాటర్ల జోరుతో ఈ లక్ష్యం కేవలం 39 బంతుల్లోనే కరిగిపోయింది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.