Let's talk: editor@tmv.in
‘స‌ర్’పై ఓవైసీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: రామచందర్ రావు

‘స‌ర్’పై ఓవైసీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: రామచందర్ రావు

Gaddamidi Naveen
27 జూన్, 2026

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్) ప్రక్రియపై ఎంఐఎం అధ్యక్షుడు, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం బీజేపీ మెంబర్‌షిప్ కార్డులు ఉన్న వారి పేర్లను మాత్రమే స‌ర్ ప్రక్రియలో చేరుస్తారంటూ ఓవైసీ చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ అనేది ప్రభుత్వ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) నిర్వహించే ఒక అధికారిక ఎన్నికల ప్రక్రియ అని స్పష్టం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యవహారంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. ఈ భయంతోనే వారు ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎస్‌ఐఆర్ అనేది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులైన బీఎల్‌వోల ఆధ్వర్యంలో జరిగే అధికారిక ప్రక్రియ అని ఓవైసీకి కూడా బాగా తెలుసు. అందుకే వారి పార్టీ తరఫున కూడా బూత్‌లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రజలను ఇందులో పాల్గొనాలని ఆయనే కోరుతున్నారు. అంతా తెలిసి కూడా, బయటకు వచ్చి ఇలాంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని రామచందర్ రావు పేర్కొన్నారు.

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం ఘోరంగా ఓడిపోబోతోందని, అందుకే ఓటర్లలో గందరగోళం సృష్టించి తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎస్‌ఐఆర్ పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.

ఓవైసీ ఆరోపణలు

అంతకుముందు గురువారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పౌరసత్వ ధృవీకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. వ్యవస్థీకృత బహిష్కరణ వాతావరణాన్ని సృష్టించడమే పాలకుల ఉద్దేశమని ఆరోపిస్తూ.. "బహుశా 2030 నాటికి కేవలం బీజేపీ మెంబర్‌షిప్ కార్డు ఉన్న వారిని మాత్రమే భారతీయ పౌరులుగా గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆశ్చర్యం లేదు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పౌరసత్వ ధృవీకరణ పత్రం మాత్రమే జాతీయతకు నిరూపణ కాకూడదని, రిజిస్ట్రేషన్ లేదా సహజసిద్ధంగా పౌరసత్వం పొందే వారికే అవి వర్తిస్తాయని, దేశంలో పుట్టిన మెజారిటీ ప్రజలకు ఇది వర్తించదని ఓవైసీ వాదించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే ఓవైసీ ప్రజల్లో లేనిపోని భయాలు రేపుతున్నారని రామచందర్ రావు ఘాటుగా బదులిచ్చారు.

ట్యాగ్‌లు
RamchanderRaoBJPBJP4TelanganaOwaisiAIMIMSIRVoterListElectionCommissionGHMCElectionsTelanganaPoliticsHyderabadPoliticalNews
‘స‌ర్’పై ఓవైసీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: రామచందర్ రావు - Tholi Paluku