Let's talk: editor@tmv.in
అన్నదాతల అరెస్టులపై ఆగ్రహం.. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ధర్నా

అన్నదాతల అరెస్టులపై ఆగ్రహం.. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ధర్నా

Gaddamidi Naveen
29 ఏప్రిల్, 2026

వడ్ల కొనుగోలులో ప్రభుత్వం విధిస్తున్న కొత్త నిబంధనలకు నిరసనగా కరీంనగర్ జిల్లా లోని చొప్పదండి పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులను ఆదుకోవాల్సింది పోయి, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చొప్పదండి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వాలు కొత్త నిబంధనల పేరుతో మరింత ఇబ్బందులు పెడుతున్నాయని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్, ఆన్‌లైన్ ట్రక్ షీట్ విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానాల కారణంగా ధాన్యం రవాణా ప్రక్రియ క్లిష్టమవుతుందని, రైతులపై అదనపు భారం పడుతోందని అన్నారు. ట్రాక్టర్‌కు ఒక్కో ట్రిప్‌కు రూ.4000 వరకు ఖర్చు అవుతుందని, ఇది చిన్న, మధ్య తరగతి రైతులకు భారమవుతుందని తెలిపారు.

కొత్త నిబంధనల కారణంగా ఒక్కో కొనుగోలు కేంద్రంలో వడ్ల ఎత్తడం రెండు నెలల వరకు ఆలస్యం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపు అకాల వర్షాలు పడితే రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే కొనుగోళ్లు మందగమనంలో సాగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని ఆంక్షలు విధించడం రైతులకు అన్యాయం అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని, రైతుల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన విధానాల ప్రకారం, ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆయ‌న సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, వర్షాలు రాకముందే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి అన్నదాతలను ఆదుకోవాలని, లేకపోతే రైతుల తరఫున ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని సుంకె రవిశంకర్ హెచ్చరించారు.

అన్నదాతల అరెస్టులపై ఆగ్రహం.. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ధర్నా - Tholi Paluku