


వచ్చేది మన ప్రభుత్వమే.. తొలి సంతకం హైడ్రా రద్దుపైనే: కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన భారీ ప్రజా ఆశీర్వాద సభ లో ఆయన ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సభలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
జగిత్యాల పార్టీ కార్యాలయం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన కేసీఆర్, రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వేదికపైకి రాగానే తనదైన శైలిలో ప్రజలకు నమస్కరించారు. దాంతో ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మారుమోగిపోయింది. పార్టీ కార్యకర్తల కేరింతలు, ఉత్సాహం మధ్య కేసీఆర్ సభలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు. తన పర్యటనతో జగిత్యాలలో గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని వీడి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం జిల్లా రాజకీయాల్లో పెను మార్పుగా మారింది.
40 ఏళ్ల నాటి తమ మిత్రత్వాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్, జీవన్ రెడ్డి అనుభవం పార్టీకి దిశానిర్దేశం చేస్తుందన్నారు. జీవన్ రెడ్డి రాకపై తాము చేయించిన సర్వేల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఆయన వెల్లడించారు. జగిత్యాల గడ్డపై విశేష పట్టున్న జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ మరింత పటిష్టమవుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధికి కేసీఆర్ కృషే నిదర్శనం
ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకంటే అభివృద్ధి ముఖ్యమని, తెలంగాణ ప్రగతికి కేసీఆర్ చేసిన కృషి అమోఘమని కొనియాడారు. సాగుకు ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. కేసీఆర్ జగిత్యాలకు వస్తున్నారని తెలియగానే, రేవంత్ రెడ్డి అప్పుడే నిద్రలేచినట్లు నటిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి రాజకీయ రంగు పులమకూడదని, ప్రజలకు మేలు చేసే నాయకత్వాన్నే తాను ఎంచుకున్నానని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రయోజనాలు సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు మాత్రం రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు ఎవ్వరూ సంతృప్తిగా లేరని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినా వాటిలో చాలా వరకు అమలు కాలేదని ఆరోపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 1.7 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందని గుర్తుచేసిన ఆయన, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అయితే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ అసలు రంగును గుర్తించారని ఆయన అన్నారు. తాను ఇక్కడ సభ పెడితే, కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డలో సభ పెట్టారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేవలం చిల్లర మాటలు, కాల్చివేతలు, కూల్చివేతలు తప్ప ఈ ప్రభుత్వానికి నిర్దిష్ట కార్యాచరణ లేదని కేసీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని కేసీఆర్ విమర్శించారు. రియల్ ఎస్టేట్ రంగం మందగించిందని, నీటి కొరత సమస్యలు పెరిగాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్మికులకు పనులు లేక ఉపాధి సమస్యలు తలెత్తాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, నేల మీద పనులు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, ఆర్డర్లు లేక చేనేత కార్మికులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం, కానీ నేడు కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు వీధిన పడ్డాయని, వారికి ప్రయాణికులు లేక ఆదాయం కోల్పోయారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ చేస్తే ఇంటికి వచ్చే యూరియా బస్తా కోసం, ఇప్పుడు రైతులు 'యాప్‌ల' వెంట తిరిగి కాళ్లు వాపులు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా నిధులు విడతల వారీగా వేస్తూ రైతులను అడుక్కునేలా చేస్తున్నారని విమర్శించారు.
హైడ్రా, మూసీ ప్రాజెక్టుపై వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవగానే తన తొలి సంతకం హైడ్రా రద్దుపైనే ఉంటుందని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును తాము వ్యతిరేకించడం లేదని, కానీ దాని పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూడటం దారుణమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో ప్రజలకు ప్రయోజనం చేకూరిందని, ప్రస్తుతం ఆ సేవలు సక్రమంగా అందడం లేదని తెలిపారు. రియల్ ఎస్టేట్ కుదేలైందని, భూమి అమ్మేవాడు ఉన్నా కొనేవాడు లేడని పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, బకాయిలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
తెలంగాణ అస్థిత్వం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అనే పదం పలకడమే నిషేధమని, ఆనాడు పేదరికం వల్ల వలసలు ఉండేవని గుర్తుచేశారు. కొందరు నేతలు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, కానీ వారు వేల జన్మలెత్తినా తనను ఏమీ చేయలేరని ఘాటుగా స్పందించారు.
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం
తెలంగాణ కోసం తాను ఒక్కడినే బయలుదేరినప్పుడు పడ్డ అవమానాలను గుర్తు చేసుకుంటూ, మళ్లీ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జైత్రయాత్ర నుంచే మొదలవుతుందని ప్రకటించారు. చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే అరణ్యమై భయపెడుతుంది.. గుండె ధైర్యం ఉంటే అదే సైన్యమై నడుస్తుంది అనే అలిశెట్టి ప్రభాకర్ కవితను ఉటంకిస్తూ జీవన్ రెడ్డిని ధైర్యవంతుడిగా కొనియాడారు. ఆరు నూరైనా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు జీవన్ రెడ్డికి సముచిత స్థానం దక్కుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
