
ఓఆర్ఎస్ వివాదం: ఐఏపీకి హైదరాబాద్ వైద్యురాలు శివరంజని సంతోష్ రాజీనామా
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శిశువైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘ఓఆర్ఎస్’ పేరుతో విక్రయిస్తున్న కొన్ని ఆహార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటంలో సంస్థ నుంచి సరైన మద్దతు లభించలేదనే ఆరోపణలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సాధారణంగా వాడే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)కు బదులుగా, కొన్ని ఫార్మా కంపెనీలు సాదాసీదా పానీయాలను 'ఓఆర్ఎస్' బ్రాండింగ్‌తో మార్కెట్ చేస్తున్నాయి. దీనివల్ల ప్రజలు తప్పుదోవ పడుతున్నారని డాక్టర్ శివరంజని సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఈ పోరాటం కారణంగా సదరు ఫార్మా కంపెనీలు ఆమెకు లీగల్ నోటీసులు జారీ చేశాయి.
సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం, మూడు వారాల క్రితం కొన్ని ఫార్మా కంపెనీలు ఆమెకు నోటీసులు జారీ చేశాయి. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు తమ బ్రాండ్‌లను దూషించే విధంగా ఉన్నాయని, వ్యక్తిగత ప్రయోజనాలు, సోషల్ మీడియా ప్రాచుర్యం కోసం చేశారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ పోస్టులను తొలగించకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించాయి.
అయితే, ఈ నోటీసులను సంతోష్ సోషల్ మీడియాలోనే ప్రశ్నించారు. ఫార్మా కంపెనీలు జారీ చేసిన నోటీసులను ఐఏపీ ఖండించాలని ఆమె కోరారు. అలాగే సదరు ఉత్పత్తులకు ఐఏపీ ఆమోదం ఉన్నట్లు కంపెనీలు చేస్తున్న ప్రచారాన్ని కూడా తప్పుబట్టారు. కానీ, ఐఏపీ ఈ విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని సంతోష్ అసంతృప్తి వ్యక్తం చేశారు, అంతేకాకుండా, తనపై నెగెటివ్ ప్రచారం జరుగుతోందని, సంస్థతో అభిప్రాయ భేదాలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మూడు నాలుగు రోజుల క్రితమే ఐఏపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) పేరుతో మార్కెట్లో అమ్ముడవుతున్న కొన్ని ఉత్పత్తుల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని సంతోష్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని ఆహార వ్యాపార సంస్థలకు ‘ఓఆర్ఎస్’ అనే పదాన్ని వాడటం వినియోగదారులను మోసం చేయడమేనని, అటువంటి బ్రాండింగ్‌ను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
