Let's talk: editor@tmv.in
మహిళా రిజర్వేషన్లపై విపక్షాలది ముమ్మాటికీ డ్రామానే:ఏపీ సీఎం

మహిళా రిజర్వేషన్లపై విపక్షాలది ముమ్మాటికీ డ్రామానే:ఏపీ సీఎం

Panthagani Anusha
21 ఏప్రిల్, 2026

తమిళనాడు ఎన్నికల ప్రచార పర్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోయంబత్తూరులో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాలు దక్షిణ భారత ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం విషయంలో ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

శాసనసభలు, పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. గతంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు 1996 నుంచే ఈ బిల్లును అడ్డుకుంటూ వచ్చాయని ఫలితంగా దాదాపు మూడు దశాబ్దాల పాటు మహిళలకు రాజకీయ న్యాయం అందకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తోందని రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు. ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలు కేవలం ఎన్నికల గారడీయేనని కొట్టిపారేశారు.

నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలను చంద్రబాబు తోసిపుచ్చారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను సుమారు 50 శాతం పెంచే ప్రతిపాదన ద్వారా అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశానికి ఉన్న 130 స్థానాలు సుమారు 195కు పెరిగే అవకాశం ఉందని ఇందులో భాగంగానే తమిళనాడులో స్థానాల సంఖ్య 39 నుండి 59కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి పెరుగుతాయని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం యొక్క ప్రస్తుత బలాన్ని తగ్గించకుండా, మొత్తం స్థానాలను పెంచడం ద్వారా సమతుల్యతను కాపాడుతామన్నారు.

అయితే 2026-27లో తాజా జనగణన ఆధారంగా డిలిమిటేషన్ చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణలో దక్షిణ రాష్ట్రాలు సాధించిన పురోగతిని శాపంగా మార్చవద్దని హెచ్చరించారు. కొత్త జనాభా లెక్కల ప్రాతిపదికన మాత్రమే విభజన జరిగితే అది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రమాదం ఉందని ఈ ప్రమాదకరమైన డిమాండ్‌ను ముందుకు తెస్తున్న కాంగ్రెస్ కూటమే దక్షిణాదికి అసలైన శత్రువు అని ఆయన విమర్శించారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కూడా ఇదే అంశంపై తాను పోరాడి 1971 జనగణన ఆధారంగా స్థానాలను స్థిరంగా ఉంచేలా చేసి దక్షిణాది హక్కులను కాపాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుత కేంద్ర ప్రతిపాదనలు అభివృద్ధికి సమాన ప్రాతినిధ్యానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ డిలిమిటేషన్ అంశాలు దేశవ్యాప్తంగా ప్రధాన చర్చాంశాలుగా మారుతున్నాయని విపక్షాల అసత్య ప్రచారాలను నమ్మకుండా ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఆయన కోయంబత్తూరు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, భద్రత సాధ్యమవుతుందని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్లపై విపక్షాలది ముమ్మాటికీ డ్రామానే:ఏపీ సీఎం - Tholi Paluku