
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమానికి శ్రీకారం
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా డంప్‌యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని సాంబమూర్తి రోడ్డులో గల కూర్మయ్య బ్రిడ్జి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ పాల్గొని బెలూన్లు ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు నాలుగు వారాలపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత, రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్, మూడో వారంలో చెత్త వర్గీకరణపై అవగాహన నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది అక్టోబర్ 2న మచిలీపట్నంలో ప్రారంభించారని గుర్తుచేసిన మంత్రి ప్రతి మూడో శనివారం ముఖ్యమంత్రి స్వయంగా ఒక జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం వదిలేసిన సుమారు 153 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలలో భూమి పైభాగంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తను ఏడాదిలోనే తొలగించామని చెప్పారు. మిగిలిన భూగర్భ చెత్తను కూడా జూన్ చివరి నాటికి పూర్తిగా తొలగించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో చెత్తను విద్యుత్‌గా మార్చే “వేస్ట్ టు ఎనర్జీ” ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రస్తుతం విశాఖపట్టణం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో ఆరు ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్త ప్రాసెసింగ్ కోసం టెండర్లు పిలిచామని జూన్ చివరి నాటికి ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే. పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రతలో దేశానికి ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎనిమిది వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని చెప్పారు. డోర్ టు డోర్ చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ 2000 ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత కేవలం పారిశుధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా డస్ట్‌బిన్లలో వేయాలని సూచించారు. రెడ్, ఎల్లో స్పాట్ల నిర్మూలన, డ్రైన్ల శుభ్రత, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, టెర్రస్ గార్డెన్ గ్రూపులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నగర ప్రజలు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
