Let's talk: editor@tmv.in
సనత్‌నగర్ టిమ్స్‌‌లో ఓపీ సేవలు ప్రారంభం

సనత్‌నగర్ టిమ్స్‌‌లో ఓపీ సేవలు ప్రారంభం

Gaddamidi Naveen
2 మే, 2026

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సనత్‌నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిలో శుక్రవారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు అధికారులు ఈ ట్రయల్ రన్ ప్రక్రియను చేపట్టారు.

వచ్చే నెల రోజుల పాటు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నసిస్ సేవలు అందుబాటులో ఉంటాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీతో సహా మొత్తం 22 విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతం చేసేందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది.

ఈ ట్రయల్ రన్ ద్వారా ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, సేవల నాణ్యతను పరిశీలించి, త్వరలోనే పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో నగరంలోని పేదలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువకానుంది.