Let's talk: editor@tmv.in
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణకు ఆన్‌లైన్ ఫారం సదుపాయం: సీఈవో

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణకు ఆన్‌లైన్ ఫారం సదుపాయం: సీఈవో

Gaddamidi Naveen
17 జూన్, 2026

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స‌ర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను ఆన్‌లైన్‌లో భర్తీ చేసి సమర్పించే అవకాశం అందుబాటులోకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో జూన్ 15న ప్రారంభమైన ఈ ప్రత్యేక ఎన్యుమరేషన్ ప్రక్రియ, జూలై 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది.

మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీఈవో వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఫారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించడం ద్వారా బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) ఇంటికి వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే.. ఓటరు రికార్డులు పాత బేస్ రోల్‌తో వేగంగా మ్యాచ్ అవుతాయని వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఓటర్లు తమ వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ-సైన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫారమ్‌ను సమర్పించడానికి ముందు ఓటర్లు కొన్ని ముందస్తు నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుందని సీఈవో స్పష్టం చేశారు. ఓటరు యొక్క మొబైల్ నంబర్ ఖచ్చితంగా వారి ఓటర్ ఐడీ కార్డ్ తో లింక్ అయి ఉండాలి. ఓటర్ ఐడీ కార్డులో ఉన్న ఓటరు పేరు యొక్క స్పెల్లింగ్, వారి అధికారిక గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్) లోని పేరుతో ఖచ్చితంగా సరిపోలాలి. ఈ రెండింటిలో పేరు తప్పుగా ఉంటే డిజిటల్ ఈ-సైన్ ప్రక్రియ విఫలమవుతుంది. అలాంటి వారు తమ బీఎల్ఓ ద్వారా నేరుగా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని ఆయ‌న‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రెండేళ్ల తర్వాత.. జూలై 1, 2026 నాటిని అర్హత గల తేదీగా తీసుకుని ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను ఈసీ చేపట్టింది. ఈ భారీ ప్రక్రియ రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న దాదాపు 4.16 కోట్ల మంది ఓటర్లకు వర్తిస్తుందని సీఈవో వివేక్ యాదవ్ వివరించారు.