Let's talk: editor@tmv.in
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. మృతులకు ప్రపంచ దేశాల నివాళి
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. మృతులకు ప్రపంచ దేశాల నివాళి

పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. మృతులకు ప్రపంచ దేశాల నివాళి

Shaik Mohammad Shaffee
23 ఏప్రిల్, 2026

సరిగ్గా ఏడాది క్రితం కశ్మీర్‌లోని పహల్గామ్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ హేయమైన దాడి జరిగి బుధవారం నాటికి (ఏప్రిల్ 22) ఏడాది పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ సమాజం మరోసారి భారత్‌కు అండగా నిలిచింది. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) సహా అగ్రరాజ్యాలు భారత్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి.

భారత వెంటే మేము: ఈయూ

పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో 27 దేశాల ఆర్థిక కూటమి అయిన యూరోపియన్ యూనియన్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. "గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక బాధితులను స్మరించుకుంటూ, భారత ప్రజలకు మేము సంఘీభావం తెలుపుతున్నాం" అని పేర్కొంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, అది ఎక్కడి నుంచి పుట్టినా సమర్థనీయం కాదని ఈయూ కుండబద్దలు కొట్టింది. బాధిత కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ, శాంతి భద్రతల స్థాపనలో భారత ప్రభుత్వంతో కలిసి నడుస్తామని స్పష్టం చేసింది. మరోవైపు బ్రిటీష్ హైకమిషన్ కూడా సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించింది. ఉగ్రవాద నిర్మూలనకు తమ నిబద్ధతను చాటుతూ, భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని గుర్తుచేసుకుంది.

ఆనాడు ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 22, 2025: కశ్మీర్‌లోని పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో ఆరోజు సందడి నెలకొంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తుండగా.. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పర్యాటకుల మతాలను అడిగి తెలుసుకుని మరీ కిరాతకంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.

'సిందూర్'తో భారత్ ధీటైన సమాధానం

ఈ అరాచకానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం అత్యంత కఠినమైన మిలిటరీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత సాయుధ దళాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. మే 7, 2025న సరిహద్దు దాటిన భారత సైన్యం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కరే తొయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపులకు చెందిన 9 ప్రధాన లాంచ్ ప్యాడ్‌లను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి.

భారత్ కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా, లాహోర్, గుజ్రాన్‌వాలా సమీపంలోని పాక్ సైనిక రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. చివరకు దిక్కుతోచని స్థితిలో పాక్ డీజీఎంఓ భారత్‌ను సంప్రదించి, మే 10న కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుంది.

దౌత్యపరంగా పాక్ ఒంటరి

మిలిటరీ చర్యలతో పాటు భారత్ ఆర్థికంగా, దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చారిత్రాత్మకమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు, ఆ దేశంతో ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు కీలక ఉగ్రవాదులను సైతం 'ఆపరేషన్ మహాదేవ్' ద్వారా వేటాడి హతమార్చింది.

నేడు పహల్గామ్ మృతుల జ్ఞాపకాలు భారతీయుల గుండెల్లో మౌనంగా రోదిస్తున్నా.. ప్రపంచ దేశాల మద్దతు, భారత సైన్యం చూపిన శౌర్యం ఉగ్రవాద వ్యతిరేక పోరులో సరికొత్త ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు భారత్ హెచ్చరిక ఈ సంస్మరణ వేళ మరోసారి గట్టిగా వినిపించింది.