Let's talk: editor@tmv.in
పహల్గాం ఉగ్రదాడికి ఏడాది..అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం

పహల్గాం ఉగ్రదాడికి ఏడాది..అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం

Panthagani Anusha
22 ఏప్రిల్, 2026

కాశ్మీర్ లోయను కుదిపేసిన పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం బాధితుల జ్ఞాపకార్థం ప్రత్యేక స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించింది. గతేడాది ఏప్రిల్ 22న బైసరన్ లోయలో జరిగిన ఘోర ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది పర్యాటకులు ఒక స్థానిక గుర్రపు కార్మికుడికి నివాళిగా లిద్దర్ నది తీరాన ఈ స్మారకాన్ని నిర్మించారు. నల్ల రాతి (బ్లాక్ మార్బుల్)తో నిర్మించిన ఈ శిలపై బాధితులందరి పేర్లను పొందుపరిచారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. ప్రజా వ్యతిరేకత

గతేడాది జరిగిన ఈ దాడి కాశ్మీర్ ఆర్థిక మూలమైన పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే ఈ ఘటనపై స్థానిక ప్రజల నుంచి ఊహించని రీతిలో వ్యతిరేకత వ్యక్తమైంది. గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా కాశ్మీరీ ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం 2025 ఏప్రిల్ 28న అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా తుదముట్టించేందుకు కట్టుబడి ఉన్నామని ఏకగ్రీవంగా ప్రకటించింది.

దర్యాప్తులో తేలిన పాక్ కుట్ర

ఈ దాడికి పాల్పడిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులను ఘటన జరిగిన మూడు నెలలకే భద్రతా బలగాలు శ్రీనగర్ పర్వత ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. అదేవిదానంగా ఈ కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ గతేడాది డిసెంబర్‌లో ఏడుగురిపై అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందులో లష్కర్-ఎ-తయిబా దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పాత్ర ఉన్నట్లు తేలింది. సరిహద్దు ఆవల నుంచి హ్యాండ్లర్లు ఈ దారుణానికి ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

చిగురిస్తున్న పర్యాటక ఆశలు

దాడి జరిగిన ఏడాదికి పహల్గాంలో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పర్యాటకులు భయాన్ని వీడి లోయ అందాలను ఆస్వాదించేందుకు తరలివస్తున్నారు. ప్రతి భారతీయుడికి కాశ్మీర్ చూడాలనే కల ఉంటుంది భయపడి ఇక్కడికి రాకపోవడం సరికాదు అని అస్సాంకు చెందిన పర్యాటకుడు నవోజిత్ సర్కార్ అభిప్రాయపడ్డారు. భద్రతా ఏర్పాట్లు స్థానికుల ఆదరణ తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పంజాబ్, లక్నోల నుంచి వచ్చిన పర్యాటకులు పేర్కొన్నారు.

ప్రస్తుతం పహల్గాం అంతటా అదనపు బలగాలను మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రచార కార్యక్రమాలు, కట్టుదిట్టమైన రక్షణ చర్యల వల్ల పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంటోందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పహల్గాం ఉగ్రదాడికి ఏడాది..అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం - Tholi Paluku