
ఓటరు జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పార్టీ నాయకులు, బూత్ స్థాయి బృందాలు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ను పర్యవేక్షించేందుకు నియమించిన పార్లమెంటరీ పరిశీలకులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణకు సంబంధించి పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారని అనంతరం జూలై 21న ప్రాథమిక ఓటరు జాబితా విడుదల అవుతుందని ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలు, సవరణల ప్రక్రియను నిశితంగా పరిశీలించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారని ఆయన టైమ్‌లైన్‌ను వివరించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఒకసారి ఓటు తొలగిస్తే దానిని తిరిగి చేర్చడం అత్యంత కష్టసాధ్యమైన పని అని సజ్జల హెచ్చరించారు. అందుకే ప్రాథమిక దశలోనే జాబితాలను జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యలను నివారించవచ్చని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎస్‌ఐఆర్ అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్న ఆయన పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతి దశలోనూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.
ఓట్ల సవరణలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కీలక పాత్ర పోషిస్తారని, అందువల్ల బీఎల్‌వోలు, బీఎల్‌ఏల మధ్య సమన్వయం బలంగా ఉండాలన్నారు. ఇందుకోసం బీఎల్‌ఏలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా నుంచి తొలగించబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
నిబంధనల ప్రకారం ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సమర్పించకపోతే ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఓటర్లు తమకు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా చైతన్యపరచాలన్నారు. ఫారమ్‌ల పంపిణీ ప్రారంభానికి ముందే బీఎల్‌ఏలు పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలని స్పష్టం చేశారు.
సీనియర్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సజ్జల ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు బూత్ స్థాయి బృందాలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని, సమర్థవంతంగా పనిచేసే బీఎల్‌ఏలకు పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటాయని హామీ ఇచ్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందే మరోసారి విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
