Let's talk: editor@tmv.in
మహిళా రిజర్వేషన్‌కు ఒకే.. డీలిమిటేషన్‌కు‘నో’: ఇండియా కూటమి
మహిళా రిజర్వేషన్‌కు ఒకే.. డీలిమిటేషన్‌కు‘నో’: ఇండియా కూటమి

మహిళా రిజర్వేషన్‌కు ఒకే.. డీలిమిటేషన్‌కు‘నో’: ఇండియా కూటమి

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ప్రతిపక్షాల ఇండియా కూటమి బుధవారం నిర్ణయించింది. అయితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ 2023కు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.ఈ నిర్ణయం ఢిల్లీలో మల్లికార్జున్‌ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ, తేజస్వీయాదవ్‌, సుప్రియాసులే, సంజయ్‌రౌత్‌, కపిల్‌సిబల్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

ఖర్గే వ్యాఖ్యలు

సమావేశం అనంతరం మాట్లాడిన మల్లికార్జున్‌ ఖర్గే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీలు ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. అయితే డీలిమిటేషన్‌ను ఈ బిల్లుతో అనుసంధానం చేయడం రాజకీయ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌కు మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం దాన్ని తీసుకువచ్చిన విధానం సరైంది కాదు. ఇది ప్రతిపక్షాలను బలహీనపరచే ప్రయత్నమని ఆయన అన్నారు. అలాగే డీలిమిటేషన్‌కు ముందు జనగణన (సెన్సస్) కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు.

మహిళా రిజర్వేషన్ – డిలిమిటేషన్ సంబంధం

నారీశక్తి వందన్‌ అధినియమ్‌ 2023, ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి డీలిమిటేషన్ ప్రక్రియ కీలకంగా ఉంటుంది. ప్రభుత్వం 2027 జనగణనకు ముందు ఈ ప్రక్రియను విడదీయడానికి రాజ్యాంగ సవరణ తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. సూచనల ప్రకారం లోక్‌సభలో మొత్తం సీట్ల సంఖ్యను 543 నుంచి 850కు పెంచే ప్రతిపాదన ఉంది. ఇందులో రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఏకమై వ్యతిరేక పోరాటం చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

డీఎంకే బ్లాక్ ఫ్లాగ్ నిరసన

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఏప్రిల్ 16న రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫ్లాగ్ నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ ఈ అంశంపై పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. డీలిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన ఆరోపించారు. మా తలపై వేలాడుతున్న కత్తి ఇప్పుడు పడింది. తమిళనాడు సహా దక్షిణ రాష్ట్రాలకు ఇది చారిత్రక అన్యాయమని స్టాలిన్ పేర్కొన్నారు.

దక్షిణ రాష్ట్రాల ఆందోళన

డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ స్థానాల పునర్విభజనలో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ మాట్లాడుతూ ఈ ప్రక్రియ భారత సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెప్పారు. రాష్ట్రాలతో సంపూర్ణ సంప్రదింపులు జరపకుండా కేంద్రం ముందుకు సాగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు

డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్‌ను కేంద్రం ఉపయోగించుకుంటోందని టీఎంసీ నాయకుడు డెరెక్‌ ఓబ్రియాన్‌ ఆరోపించారు. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కు పెంచే ప్రతిపాదన వెనుక కేంద్రానికి రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ జనగణన లేకుండా డీలిమిటేషన్ చేపట్టడం సరైంది కాదన్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టడం కూడా అనుమానాస్పదమని పేర్కొన్నారు.

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లట్‌ కూడా ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సూచించారు.

కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రమాదకరమని అన్నారు. ఈ ప్రక్రియ వల్ల ముఖ్యంగా దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అస్సాం, జమ్మూ కశ్మీర్‌లో డీలిమిటేషన్ కమిషన్ పని తీరు ఇప్పటికే వివాదాస్పదమైందని, ఇది అధికార పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడుతోందని ఆయన ఆరోపించారు.

ఇతర పార్టీల స్పందన

శివసేన(యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌కు తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే జనగణన లేకుండా డీలిమిటేషన్ చేపడితే దేశంలో తీవ్ర వివాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా నవీన్‌ పట్నాయక్‌ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాంజీని రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించేందుకు 48 గంటల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆయన మద్దతు తెలిపారు. మొత్తంగా మహిళా రిజర్వేషన్ అమలుకు మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు, డీలిమిటేషన్ ప్రక్రియపై మాత్రం కేంద్రాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పార్లమెంట్‌లో సవరణలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాయి.

ఓబీసీల హక్కుల దోపిడి: రాహుల్ గాంధీ

మహిళా రిజర్వేషన్ చట్టం అమలు, డీలిమిటేషన్ ప్రక్రియ పేరుతో ప్రధాని నరేంద్రమోడీ ఓబీసీల హక్కులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చర్యలు ‘దేశ వ్యతిరేక కార్యకలాపాలు’ అంటూ విమర్శించారు. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ సవరణ బిల్లుకు ముందు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే ఇప్పటికే అమలులో ఉన్న నారీశక్తి వందన్‌ అధినియమ్‌ ప్రకారం ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు.

ఓబీసీల హక్కుల దోపిడి

ప్రధాని 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని చూస్తున్నారని, ఆ జనగణనలో ఓబీసీల పూర్తి గణాంకాలు లేవని అన్నారు. దేశంలో వెనుకబడిన వర్గాలు సుమారు 50 శాతం ఉన్నప్పటికీ వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వకుండా వారి వాటాను కాజేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కులగణన డేటా బయటకు వస్తుండటంతోనే కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ ప్రక్రియ అమలు అయితే దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 2026లో జరిగే జనగణన ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆయన సూచించారు.

మహిళా రిజర్వేషన్ పేరుతో అధికార కబ్జాకు ప్రయత్నం

మహిళా రిజర్వేషన్ అమలు పేరుతో డీలిమిటేషన్, గెర్రీమాండరింగ్(ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే మార్చడం) ద్వారా అధికారాన్ని కబ్జా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని మహిళలకు అనుకూలంగా ఉన్నట్టు దేశానికి సందేశం ఇవ్వాలని చూస్తున్నారని, కానీ వాస్తవానికి మహిళా రిజర్వేషన్‌కు సంబంధం లేని మార్పులను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మోదీజీ, మీరు మహిళలకు అనుకూలురని దేశానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. మీకు ఎఫ్‌స్టీన్ ఫైల్స్ పట్ల భయం ఉందని నాకు తెలుసని గాంధీ వ్యాఖ్యానించారు. తన సొంత అజెండా ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.

నేడు సభ ముందుకు

మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల ముందు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్ఠంగా 850 వరకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తాజాగా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం, జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించి లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కూడా సీట్ల సంఖ్యను పెంచనున్నారు. దీని ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బిల్లులో కీలక అంశాలు

• లోక్‌సభలో గరిష్ఠంగా 850 మంది సభ్యులు ఉండే అవకాశం

• రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా సీట్ల పెంపు

• మహిళలకు 33% రిజర్వేషన్ అమలు

• రిజర్వేషన్ సీట్లు రోటేషన్ పద్ధతిలో వివిధ నియోజకవర్గాలకు కేటాయింపు

• రాజ్యాంగంలోని ఆర్టికల్ 81లో సవరణ ప్రతిపాదన

బిల్లులో పేర్కొన్న ప్రకారం, లోక్‌సభలో 815 మంది రాష్ట్రాల నుంచి, 35 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే తుది సీట్ల సంఖ్యను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది. డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. జనాభా ఆధారంగా సీట్ల పంపకం జరగనుండటంతో, దక్షిణ రాష్ట్రాలకు కొంత ప్రయోజనం కలగవచ్చని అంచనా వేస్తున్నారు.

పార్లమెంటులో పరిస్థితి

ప్రభుత్వం ఈ బిల్లును ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి త్వరగా ఆమోదింపజేయాలని యోచిస్తోంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు లోక్‌సభలో మెజారిటీ బలం ఉన్నప్పటికీ, విపక్షాలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నందున చర్చలు కీలకంగా మారనున్నాయి.