Let's talk: editor@tmv.in
విశాఖలో భవనం స్లాబ్ కూలి ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

విశాఖలో భవనం స్లాబ్ కూలి ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

Panthagani Anusha
5 మే, 2026

విశాఖపట్నం నగరంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. మరమ్మతు పనులు జరుగుతున్న భవనంలో స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అధికారుల వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన భవనంలో గతంలో ఫోటో స్టూడియో నడిచేది. కాలక్రమేణా భవనం సుమారు రెండు అడుగుల మేర కిందకు దిగిపోవడంతో దానిని తిరిగి పైకి ఎత్తేందుకు హైడ్రాలిక్ జాక్స్ సహాయంతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనుల సమయంలోనే స్లాబ్ కూలిపోయినట్లు సమాచారం. కాగా అక్కడ పనిచేస్తున్న గాజువాక కు చెందిన నాగేశ్వరరావు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు.

ఘటనపై న్యూ పోర్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కామేశ్వరరావు మాట్లాడుతూ భవనాన్ని పైకి లేపే ప్రక్రియలో ఈ ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అని తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.