
ఏరువాక పౌర్ణమి.. రైతులతో కలిసి నాగలి పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ సంస్కృతికి, వ్యవసాయ రంగానికి అత్యంత విశిష్టమైన ‘ఏరువాక పౌర్ణమి’ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఖరీఫ్ సాగు పనులకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఆదివారం జరిగిన ఏరువాక వేడుకల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొలంలో దిగి, రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి వ్యవసాయ పనులను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.
రాష్ట్ర రైతాంగానికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.. తెలంగాణలో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులందరూ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భూమాతను ప్రార్థించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెప్పారని, ఆ అన్నాన్ని పండించే రైతే దేశానికి వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రైతులు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతికి, భూమాతకు నమస్కరించే పవిత్రమైన రోజు ఇదని మంత్రి తెలిపారు.
సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రభుత్వం రైతులకు కొండంత అండగా నిలుస్తోందని మంత్రి వివరించారు. రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే వినియోగించాలని మంత్రి సూచించారు. నీటిని పొదుపుగా ఉపయోగిస్తూ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలకు ఎలాంటి తెగుళ్ల బెడద లేకుండా ఊహించిన దానికంటే ఎక్కువ దిగుబడి రావాలని, ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. ఈ వేడుకల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
