Let's talk: editor@tmv.in
త్రివర్ణ రిబ్బన్‌ కట్‌కు ఒమర్ అబ్దుల్లా నిరాకరణ

త్రివర్ణ రిబ్బన్‌ కట్‌కు ఒమర్ అబ్దుల్లా నిరాకరణ

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌‌ అబ్దుల్లా బుధవారం ఒక కార్యక్రమం ప్రారంభోత్సవ సమయంలో జాతీయ పతాక రంగులతో ఉన్న రిబ్బన్‌ను కట్ చేయడానికి నిరాకరించారు. దానిని కత్తిరించకుండా విప్పి నిర్వాహకులకు ఇచ్చి గౌరవంగా తీసిపెట్టాలని సూచించారు. శ్రీనగర్‌లోని కశ్మీర్‌‌ హాట్‌ వద్ద నిర్వహించిన ‘నో యువర్‌‌ అర్టిసన్స్‌ ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన రిబ్బన్ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో భారత త్రివర్ణ పతాకాన్ని పోలి ఉండటాన్ని గమనించిన వెంటనే ఆయన ఆగిపోయారు. అనంతరం ఆ రిబ్బన్‌ను కత్తిరించకుండా విప్పి నిర్వాహకులకు ఇచ్చి, దానిని గౌరవంగా తీసిపెట్టాలని సూచించారు. రిబ్బన్ తొలగించిన తర్వాత కార్యక్రమాన్ని సాధారణంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సురిందర్ చౌదరి, ముఖ్యమంత్రికి సలహాదారు నాసిర్ అస్లాం వాణీ తదితరులు పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో ప్రశంసలు

ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నేతలు, నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత గగన్ భగత్ మాట్లాడుతూ ఇది త్రివర్ణ పతాకానికి చూపాల్సిన నిజమైన గౌరవమని పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతి అధ్యయనాల కేంద్రానికి చెందిన పరిశోధకుడు షేక్ ఖాలిద్ జహంగీర్ కూడా ఈ నిర్ణయాన్ని ‘ఆలోచనాత్మకమైన చర్య’గా అభివర్ణించారు. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రైవేట్ సంస్థ జాతీయ పతాక రంగులతో రిబ్బన్ ఏర్పాటు చేయడం పట్ల కొందరు ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్‌డీ చేస్తున్న మోనికా వర్మ స్పందిస్తూ త్రివర్ణ పతాకాన్ని రిబ్బన్‌గా ఉపయోగించడం గురించి నిర్వాహకులు ముందుగా ఆలోచించలేదా? అని ప్రశ్నించారు.