Let's talk: editor@tmv.in
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందే.. చంద్రబాబు
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందే.. చంద్రబాబు

అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందే.. చంద్రబాబు

Dantu Vijaya Lakshmi Prasanna
19 జూన్, 2026

రాష్ట్రంలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, జూలై నెల నుంచి ప్రతి ఒక్క అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని ఆదేశించారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, వారంలో మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని కనీసం నాలుగు సార్లు సందర్శించాలని, అలాగే నియోజకవర్గాల నోడల్ అధికారులు నెలలో ఒకే మండలాన్ని నాలుగు సార్లు సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని పక్కా ప్రణాళికను ఖరారు చేశారు. అధికారులు ఫీల్డులోకి వెళ్తేనే ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు.

360 డిగ్రీల్లో ఉద్యోగుల విశ్లేషణ - సింగపూర్ తరహా పరిపాలన

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి నిఘా పెట్టారు. ఇకపై అందరి పనితీరును 360 డిగ్రీల కోణంలో నిరంతరం విశ్లేషిస్తామని హెచ్ఛరించారు. పాలనా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటిన నేపథ్యంలో, ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. లోపాలను గుర్తించి, వాటిని వెంటనే సరిదిద్దుకునేలా అధికారులు ఆలోచన చేయాలన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల పనితీరును అంతకంతకూ మెరుగుపరచడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలనా విధానాలను అవలంభిస్తున్న సింగపూర్ దేశపు పద్ధతులను పరిశీలించి, వాటిని మన రాష్ట్రంలోనూ అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

దేవాదాయ శాఖలో మార్పులు - మున్సిపల్ రోడ్ల మరమ్మత్తులపై నిఘా

దేవాలయాలకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న సేవలపై సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దేవాదాయ శాఖ పనితీరు ఇంకా మెరుగవ్వాల్సి ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని వినూత్న సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రహదారుల దుస్థితిపై సీఎం సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 11,600 గుంతలను గుర్తించగా, అందులో ఇప్పటికే 79 శాతం గుంతలను పూడ్చివేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన రోడ్ల మరమ్మత్తు పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా నగరాలు, గ్రామాలను అనుసంధానించే అర్బన్-రూరల్ కనెక్టివిటీ రోడ్ల మరమ్మత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ విషయంలో ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

గూగుల్ భాగస్వామ్యంతో డేటా ఆధారిత పాలన

సాంకేతికతను పరిపాలనకు అనుసంధానం చేయడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు, ఈసారి డిజిటల్ దిగ్గజం 'గూగుల్'తో కీలక భాగస్వామ్యానికి తెరతీశారు. రాష్ట్రంలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ (డేటా ఆధారిత పాలన) సాగించేందుకు గూగుల్ సంస్థ మనతో కలిసి పనిచేయడానికి అంగీకరించిందని సీఎం వెల్లడించారు. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖలో గూగుల్ సాంకేతికతను విజయవంతంగా వాడుతున్నామని, అదే తరహాలో మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ గూగుల్ సేవలను, వినూత్న సాంకేతికతను విస్తరింపజేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలు మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతాయని, అవినీతికి తావులేని పాలనను అందించవచ్చని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

అర్జీదారులకే పీజీఆర్ఎస్ ట్రాకింగ్ సౌకర్యం

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష జరిపారు. ప్రజలు ఇచ్చే అర్జీలను కేవలం స్వీకరించడమే కాకుండా, వాటిని త్వరితగతిన పరిష్కరించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం సరికొత్త సాంకేతిక వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు. తాము ఇచ్చిన ఫిర్యాదు ఏ అధికారి వద్ద ఉంది? ఏ స్థాయిలో ఉందో అర్జీదారులే స్వయంగా ట్రాక్ చేసుకునేలా సులభతరమైన ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. దీనివల్ల ప్రజల్లో జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కీలక ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్ ప్రతినిధులు పాల్గొని ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారు.