Let's talk: editor@tmv.in
జాతీయ రగ్బీ ఛాంపియన్‌గా ఒడిశా

జాతీయ రగ్బీ ఛాంపియన్‌గా ఒడిశా

Shaik Mohammad Shaffee
18 ఏప్రిల్, 2026

జాతీయ సీనియర్‌ మహిళల రగ్బీ 7ఎస్ ఛాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టు జైత్రయాత్ర సాగించింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో ఒడిశా మహిళల జట్టు 27-0 పాయింట్ల తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బీహార్‌ను మట్టికరిపించి, 13వ జాతీయ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని ముద్దాడింది. గత ఆరేళ్ల కాలంలో ఒడిశా మహిళా జట్టుకు ఇది మూడో జాతీయ టైటిల్‌ కావడం విశేషం.

ఏకపక్షంగా సాగిన పోరు

మ్యాచ్‌ ఆరంభం నుంచే ఒడిశా క్రీడాకారిణులు మైదానంలో ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రత్యర్థి జట్టుకు ఒక్క పాయింట్‌ కూడా ఇచ్చే అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడారు. ఒడిశా విజయంలో నిర్మాల్య రౌత్‌ కీలక పాత్ర పోషించింది. ఆమె ఏకంగా మూడు ట్రైల ద్వారా 15 పాయింట్లు సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. మరో క్రీడాకారిణి తరుణలత నాయక్ రెండు ట్రైలతో 10 పాయింట్లు జోడించగా, పార్బతి హన్స్‌దా కూడా పాయింట్ల పట్టికలో చేరి జట్టు విజయాన్ని ఖాయం చేసింది.

కాంస్యం బెంగాల్‌ కైవసం

అంతకుముందు జరిగిన మూడో స్థానం కోసం జరిగిన పోరులో పశ్చిమ బెంగాల్‌ జట్టు 26-0తో ఢిల్లీపై ఘనవిజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. బెంగాల్‌ తరఫున రియా ఓరాన్ (7 పాయింట్లు), రిమా ఓరాన్ (5), నమిస్తా ఓరాన్ (5), సంధ్యా రాయ్ (9) రాణించారు. మహిళల విభాగం ముగియడంతో, అందరి దృష్టి ఇప్పుడు పురుషుల పోటీలపై పడింది. ఏప్రిల్ 20, 21 తేదీల్లో పురుషుల విభాగం పోటీలు జరగనున్నాయి.