Let's talk: editor@tmv.in
పాలనకు అడ్డుపడం.. కానీ అబద్ధాలు చెబితే ఊరుకోం: ఎంకే స్టాలిన్

పాలనకు అడ్డుపడం.. కానీ అబద్ధాలు చెబితే ఊరుకోం: ఎంకే స్టాలిన్

Gaddamidi Naveen
19 మే, 2026

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి తాము ఎలాంటి ముందస్తు అడ్డంకులు సృష్టించబోమని, అయితే తమపై చేసే తప్పుడు ప్రచారాలను, వ్యక్తిత్వ హనన దాడులను మాత్రం గట్టిగా తిప్పికొడతామని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అధికార పార్టీ వ్యాప్తి చేసే అబద్ధాలను ఎండగట్టాలని ఆయన సోమవారం సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్టాలిన్ తన పోస్ట్‌లో పేర్కొంటూ.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. వారు పరిపాలన సాగించుకోనివ్వండి, మేమేం దానికి అడ్డుపడం. కానీ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురదజల్లాలని చూస్తే మాత్రం మేము ఊరుకోం, తగిన వివరణలు ఇస్తాం. సోషల్ మీడియాలో డీఎంకేపై అబద్ధాలు ప్రచారం చేస్తే, నిజా నిజాలను ప్రజల ముందు ఉంచుతాం. ఈ విషయంలో కామ్రేడ్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తంజావూరులో జరిగిన ఒక పార్టీ కార్యకర్త వివాహ వేడుకకు హాజరైనట్లు, ఆ తర్వాత తిరుచిరాపల్లి (త్రిచి) మీదుగా ప్రయాణిస్తూ కార్యకర్తల అపారమైన అభిమానాన్ని చూశానని ఆయన పేర్కొన్నారు.

ఓటమిపై 38 మంది సభ్యుల కమిటీ సమీక్ష

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి స్టాలిన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను, ఓటమికి గల కారణాలను అంచనా వేయడానికి శనివారం ఆయన 38 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ సభ్యులతో భేటీ అయిన స్టాలిన్ వారికి పలు మార్గదర్శకాలను జారీ చేశారు. పార్టీ శ్రేణులు లేదా నాయకత్వంపై ఎలాంటి విమర్శలు వచ్చినా, వాటిని నిష్పక్షపాతంగా విని, వాస్తవాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. ఈ నివేదికలను జూన్ 5 లోగా సమర్పించాలని, దాని ఆధారంగా జూన్ చివరి నాటికి పార్టీలో అవసరమైన సంస్కరణలు, దిద్దుబాటు చర్యలు చేపడతామని స్టాలిన్ వెల్లడించారు.