

కొవిడ్ సమయంలో నర్సుల సేవలు చిరస్మరణీయం: మంత్రి పొన్నం ప్రభాకర్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజానికి నర్సులు అందిస్తున్న నిరంతర సేవలను గుర్తిస్తూ, ఈ సందర్భంగా వారిని మంత్రి ఘనంగా సన్మానించారు.
సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, నర్సింగ్ అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని, అది సేవ మానవత్వంతో కూడిన గొప్ప బాధ్యత అని కొనియాడారు. రోగి కోలుకోవడంలో 50 శాతం వైద్యం పని చేస్తే, మిగిలిన 50 శాతం నర్సులు అందించే సంరక్షణ, మద్దతు సేవలపైనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలోని ఒత్తిడిని తట్టుకుంటూ, అంకితభావంతో పనిచేస్తున్న నర్సుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దశాబ్దాలుగా చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న నీలోఫర్ ఆసుపత్రి చరిత్ర గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రతిరోజూ సుమారు 1,500 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారని, ఆసుపత్రిలో 2,000 పడకల సామర్థ్యం ఉందని ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద ఎత్తున రోగులకు సేవలు అందించడంలో నర్సులే వెన్నెముకగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి, నిస్వార్థంగా పనిచేసిన నర్సుల సేవలు ఎప్పటికీ మరువలేమని మంత్రి గుర్తుచేశారు. నర్సులు కేవలం వైద్యం అందించడమే కాకుండా, రోగుల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించడం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, డీఎంహెచ్‌ఓ వెంకట్, నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
