
తమిళనాడు రాజకీయాల్లో నెంబర్ గేమ్!
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుతమైన మలుపు చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకె) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిని కోరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో నిలిచింది. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందడంతో విజయ్ తన ముఖ్య అనుచరులైన "బుస్సీ" ఆనంద్, ఆధవ్ అర్జున, అన్నాడీఎంకే నుంచి వచ్చిన సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్ వంటి ప్రముఖులతో కలిసి వెళ్లి క్లెయిమ్ లెటర్ సమర్పించారు.
ఈ ఎన్నికల ఫలితాలు దశాబ్దాల ద్రవిడ రాజకీయ ఆధిపత్యాన్ని సవాలు చేశాయి. మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే 108 సీట్లతో ముందంజలో ఉండగా, అధికార డీఎంకే 59 స్థానాలకు పరిమితమై భారీ ఎదురుదెబ్బ తింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే 47 సీట్లు సాధించగా, మిగిలిన స్థానాల్లో పీఎంకే 4, ఐయూఎంఎల్ 2, సిపిఐ 2, వీసీకే 2, సీపీఐ-ఎం 2, అలాగే బీజేపీ, డీఎండీకే, ఏఎంఎంకే తలా ఒక సీటును గెలుచుకున్నాయి. విజయ్ తన మెజారిటీని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ మద్దతును ఇప్పటికే పొందారు, కానీ మరింత సుస్థిరమైన పాలన కోసం ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోసం చర్చలు జరుపుతున్నారు. అయితే ఆ పార్టీల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల సంకేతాలు అందకపోవడం కొంత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ మద్దతుతో 112 కి చేరిన విజయ్ బలం సరిపోదంటూ, గవర్నర్ 118 మంది లిస్ట్ ఇమ్మనడం గమనార్హం.
విజయ్ తన రాజకీయ రంగప్రవేశం చేసిన అనతి కాలంలోనే ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు ఆయన 'తమిళ జాతీయవాదం', 'అవినీతి రహిత పాలన' హామీల పట్ల ఆకర్షితులయ్యారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకుని విజయ్ తన పార్టీ సంఖ్యా బలాన్ని పెంచుకున్నారు. కాంగ్రెస్ నాయకులతో జరిగిన సమావేశం తర్వాతే ఆయన గవర్నర్‌ను కలవడం గమనార్హం.
తమిళనాడులో ఇప్పుడు అందరి దృష్టి విజయ్ ప్రమాణస్వీకార వేడుకపైనే ఉంది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చి, ఎంజీఆర్ తరహాలో ప్రజాదరణ పొందిన విజయ్, ఇప్పుడు పరిపాలనలో ఏ విధంగా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 118 మార్కును చేరుకోవడానికి కాంగ్రెస్ మద్దతు సరిపోయినా, అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న చర్చ నడుస్తోంది. డీఎంకే తన పట్టును కోల్పోవడం, అన్నాడీఎంకే మూడవ స్థానానికి పడిపోవడం తమిళ రాజకీయాల్లో ఒక భారీ మార్పుగా పరిగణించవచ్చు. విజయ్ నాయకత్వంలోని ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుందని టీవీకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ వేడుకతో తమిళనాడులో 'దళపతి' పాలన అధికారికంగా ప్రారంభం కానుంది.
మరోవైపు డీఎంకే, ఏఐఏడీఎంకే కలిస్తే 120 సీట్లు వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్ వంటి కేంద్ర పార్టీల మద్దతులేకుండా ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయన్న ఊహా గానాలు మొదలయ్యాయి.
తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా?
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. పెరంబూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందగా, తిరుచ్చి ఈస్ట్‌లో డీఎంకేకు చెందిన ఎస్. ఇరుదయరాజ్‌పై 27,416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో, విజయ్ ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో, విజయ్ తన రాజీనామా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కొనసాగాలని, తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పెరంబూరుపై మొగ్గు చూపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే టీవీకే వర్గాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
