Let's talk: editor@tmv.in
ఐఐటీ హైదరాబాద్‌లో ‘క్రిమ్సన్ ఎనర్జీ’ భాగస్వామ్యంతో న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ప్రారంభం

ఐఐటీ హైదరాబాద్‌లో ‘క్రిమ్సన్ ఎనర్జీ’ భాగస్వామ్యంతో న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ప్రారంభం

Gaddamidi Naveen
24 జూన్, 2026

దేశంలోని అణుశక్తి రంగంలో నిపుణులైన మానవ వనరుల కొరతను తీర్చడానికి, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఐఐటీ హైదరాబాద్ ఒక కీలక అడుగు వేసింది. ‘క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ భాగస్వామ్యంతో సరికొత్త 'న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స (ఎన్‌టీఓపీ) ను ప్రారంభించినట్లు ఐఐటీ హైదరాబాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

‘న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్’ (ఎన్‌టీఓపీ) పేరుతో నిర్వహించనున్న ఈ కోర్సు ఆగస్టు 3 నుంచి ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రారంభం కానుంది. మూడు నెలల పాటు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ విధానంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా ఇంజినీర్లు, నిపుణులు అణు విద్యుత్ సాంకేతికతలు, వాటి నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఆపరేషన్లపై సమగ్ర అవగాహన పొందే అవకాశం ఉంటుంది.

దేశం ప్యూర్‌ ఇంధన వనరుల వైపు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో అణు సాంకేతిక రంగంలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన నిపుణుల అవసరం మరింత పెరగనుంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఉన్న నైపుణ్య లోటును తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఐఐటీ హైదరాబాద్ తెలిపింది.

అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక, నిర్వహణ, భద్రతా మరియు నియంత్రణ అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా ఈపీసీ సంస్థలు, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీలు, విద్యుత్ రంగ సంస్థలు, మౌలిక వసతుల అభివృద్ధిలో పాల్గొనే ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, ప్రారంభ, మధ్యస్థాయి కెరీర్‌లో ఉన్న ఇంజినీర్లు, మేనేజర్లను లక్ష్యంగా చేసుకుని కోర్సును రూపొందించారు.

కోర్సులో రియాక్టర్ ఫిజిక్స్, రియాక్టర్ ఇంజినీరింగ్, రేడియేషన్ షీల్డింగ్, అణు భద్రత, అణు వ్యర్థాల నిర్వహణ, రియాక్టర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు కంట్రోల్ సిస్టమ్స్, థర్మల్ హైడ్రాలిక్స్, క్వాలిటీ అష్యూరెన్స్, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాలతో పాటు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ (ఎస్‌ఎంఆర్‌లు) వంటి ఆధునిక అణు సాంకేతికతలపై కూడా శిక్షణ అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ అధ్యాపకులతో పాటు అణుశక్తి విభాగం (డీఏఈ)కు చెందిన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు బోధన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ, వ్యూహాత్మక రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీలో అకాడమిక్ నైపుణ్యాన్ని, పరిశ్రమల అనుభవాన్ని సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ట్యాగ్‌లు
IITHyderabadNuclearTechnologyNuclearEnergyCleanEnergyIndiaEnergyEnergySectorEngineeringEducationNuclearPowerTechnologyTraining
ఐఐటీ హైదరాబాద్‌లో ‘క్రిమ్సన్ ఎనర్జీ’ భాగస్వామ్యంతో న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ప్రారంభం - Tholi Paluku