Let's talk: editor@tmv.in
20 వేల పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి: సీఎంకు కేటీఆర్ లేఖ

20 వేల పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి: సీఎంకు కేటీఆర్ లేఖ

Gaddamidi Naveen
5 జులై, 2026

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత తరఫున భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ప్రకటించిన 5 వేల పోలీస్ పోస్టుల నోటిఫికేషన్‌ను కనీసం 20 వేల పోస్టులకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

కేటీఆర్ తన లేఖలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల యువతేనని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్‌లో హాస్టళ్లు, పీజీల్లో ఉంటూ ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. అలాంటి యువత ఆశలను ప్రభుత్వం దెబ్బతీయకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం "నీళ్లు, నిధులు, నియామకాలు" అనే నినాదంతో సాగిందని గుర్తుచేసిన కేటీఆర్, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత డిమాండ్లను ప్రభుత్వం విస్మరించడం సమంజసం కాదన్నారు. కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చినట్లుగా చెప్పుకోలేమని విమర్శించారు.

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 17,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. స్వయంగా ముఖ్యమంత్రే గతంలో 12,000 ఖాళీలు ఉన్నాయని ప్రకటించారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేవలం 5,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల దాదాపు 15 లక్షల మంది అభ్యర్థులు నిరాశకు గురై, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో ప్రతిరోజూ ఆందోళనలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో 47,000 పోలీస్ ఉద్యోగాలు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు విడతల్లో దాదాపు 47 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు కేటీఆర్ వివరించారు. 2016లో 9,281 కానిస్టేబుల్ పోస్టులు, 539 ఎస్‌ఐ పోస్టులు, 2018లో 18,428 కానిస్టేబుల్ పోస్టులు, 1,271 ఎస్‌ఐ పోస్టులు, 2022లో 16,614 కానిస్టేబుల్ పోస్టులు, 554 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. అలాగే కేసీఆర్ నాయకత్వంలో మొత్తం 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, 1.60 లక్షలకు పైగా నియామకాలు పూర్తి చేశామని, స్థానిక యువతకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హామీలు ఏమయినట్టు?

2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 'జాబ్ క్యాలెండర్', ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చిందని.. రెండున్నరేళ్లు దాటినా వాటిని నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాలంలో కేవలం 17 వేల కొత్త ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని.. బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిన 50,000 నియామకాలకు సంబంధించిన నియామక పత్రాలను పంపిణీ చేసి వాటికీ తమ ప్రభుత్వమే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నంబర్ 87 ప్రకారం ఎస్‌ఐ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలు, కానిస్టేబుల్ అభ్యర్థులకు 32 సంవత్సరాలు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. గత పోలీసు నియామక నోటిఫికేషన్ వచ్చి నాలుగేళ్లు కావడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని తెలిపారు. అందువల్ల కానిస్టేబుల్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని 36 ఏళ్లకు, ఎస్‌ఐ అభ్యర్థులకు 37 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలలో శారీరక పరీక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పుడు ఎస్‌ఐ పోస్టుకు అర్హుడైన అభ్యర్థిని కానిస్టేబుల్ పోస్టుకు అనర్హుడిగా ప్రకటించడం న్యాయం కాదన్నారు.

తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, పోలీసు శాఖలో కనీసం 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువతకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.

ట్యాగ్‌లు
KTRRevanthReddyTelanganaTelanganaPolicePoliceRecruitmentConstableJobsSIJobsJobNotification
20 వేల పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి: సీఎంకు కేటీఆర్ లేఖ - Tholi Paluku