
Note: ప్రత్యేక విభాగం కొరకు
కొన్ని పాటలు , కొన్ని సినిమాలు అలా జ్ఞాపకాల్లో నిక్షిప్తం. నిత్య నూతనం. నిజానికి ఆ సినిమా వచ్చినపుడు విన్న ఆ పాట అర్థం అప్పుడు సరిగ్గా తెలియదు. ఎందుకో నచ్చి మన మనసుల్లొ ఉండిపోతుంది. కానీ తర్వాతెప్పుడో ఆ పాట చూడటం తారస పడితే చూస్తే , పాట సందర్భం , సంగీత సాహిత్యాలు , భావం , చిత్రికరణ అన్నీ కలిసి పాటలోని నిగుఢత్వాన్ని మనకి అర్థం చేయిస్తాయి. టెక్నాలజీ పుణ్యమాని ఇన్నాళ్ళూ లేని సౌలభ్యం ఇప్పుడుంది మనకి నచ్చిన పాత సినిమాలు , పాటలు సన్నివేశాలు యూట్యూబులో చూసుకోవచ్చు.
చిన్ని చిన్ని కొరికకలడగ శ్రీనివాసుడు నన్నడగా... అన్నుల మిన్న అలమేలుమంగై ఆతని సన్నిది కొలువుంటా "
ఈ పాటకి సంబంధించి సంగీత సాహిత్యాల్లోనే ఒక వలపు ధార ఉంటుంది. అందుకే హృదాయానికి హత్తుకు పోయింది. మనుసులోని భావాలని చెపుతూ కథని ముందుకు నడిపించటం పాటలోని ప్రయోజకత్వం. విశ్వనాథ్ ప్రతీసినిమాల్లోనూ ప్రతి పాట అలా సందర్బానుసారంగానే ఉంటూ ప్రయోజనాన్ని సాధిస్తూ ఉంటుంది.
సందర్భం:
గంగ సాంబయ్యని ప్రేమించింది.. ఎంతగా అంటె అతని మనసులో తను లేను అని తెలిసినా ఆమెలో ప్రేమ తగ్గదు. అతని పట్ల ఇష్టమూ తగ్గదు. ఏమీ ఆశించని అమాయక ప్రేమ అది. అతని కసురు లో , విసుగు లో కూడా ప్రేమనే అర్థం చేసుకుంటుంది. వారిద్దరి మధ్య సాగే గిల్లి కజ్జాలు పొరపొచ్చాలు లేని వాళ్ళ స్నేహానికి నిదర్శనం. అతనితో కలిసి బతకాలని అనుకుంది. కానీ అతడు తన మరదలిని పెళ్ళి చేసుకోవాలని ఆశ పడ్డాడు. పెళ్ళికి కావలసినవి అన్నీ ఒక్కక్కటే కొన్నాడు. అప్పటికీ చెప్పింది , చదివుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందనుకున్నావా అని.. కానీ అతనికి మరదలు తననె చేసుకుంటున్నదన్ననమ్మకం.
కానీ చివరికి మరదలు వేరే అతన్ని ప్రేమించిందని తెలిసి పెద్ద మనసుతో పెళ్ళి చేసి పంపాడు. ఇన్నాళ్ళు మరదలి మీద ఆశ పెట్టుకొని ఆనందంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒంటరి అయ్యాడు. ఒక్కసారి మనసు బద్దలైంది. కానీ ఎం చేయగలడు. అందుకే ఆ బాధలో ఫూటూగా తాగి..ఇంటికొచ్చాడు. ఇంట్లో ఉయ్యాల్లో పడుకున్న తల్లి దండ్రి లేని అన్ని తానై పెంచుతున్న మేనోల్లుడిని చూసాడు. అవును.. తనకి పెళ్ళై పిల్లలు పుడితే వీడిని సరిగ్గా చూసుకోను కనక దేవుడు తన పెళ్ళి జరపలేదని.. తాను పెళ్ళి చేసుకున్నా పిల్లల్ని కనకుండా ఉండటమే సరైన నిర్ణయమని అనుకున్నాడు. ఇతన్ని గమనిస్తున్న గంగ... సాంబయ్యకి మేనల్లుడి మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకుంది.
స్వంత పిల్లలు ఉంటే మేనల్లుడిని సరిగ్గ చూసుకోలేమో అనే అతని భయాన్నీ అర్థం చేసుకుంది. కానీ ఆ పిల్లాడికి తల్లి , అతనికి ఆడ దిక్కూ ఉండాలనే అతని కోరికనీ మన్నించింది. అది సబబే నేమో అనిపించింది. పెళ్ళి చేసుకున్నా పిల్లలు ఉండకూడదు అని అతడు అనుకుంటున్నాడు. అతన్ని చేసుకొబోయే అమ్మాయి ఆ మేనళ్లుడినే స్వంత కొడుకులా ప్రేమించగలగాలి , అంతేకదా అందుకే అమె ఆలోచించింది. తనకి కావలసింది అతనితో జీవితం. అతడు తనకి ఉంటే చాలు. ప్రేమే ప్రేమని అర్థం చేసుకుంటుంది. అందుకే అతడి ప్రేమని ఆమె అర్థం చేసుకుంది. ప్రేమ ఎంత శక్తివంతం అంటే ఒక్కోసారి తనకు తాను ఏమీ మిగుల్చుకోదు. అవతలి వారి సౌకర్యం , వాళ్ళ ఆనందాన్ని మించి ఇంకేది కనిపించదు. ఏం చేసి వాళ్ళని పొందే అర్హత సాధించాలన్నది తప్ప ఇంకే లక్ష్యం ఉండదు. అందుకే ఒక నిర్ణయం తీసుకుంది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని వచ్చింది. అతడి కోరిక మేరకు అతడిని పెళ్ళి చేసుకునే అర్హత సాధించింది. ఇహ అతన్ని పెళ్ళి చేసుకోవటమే మిగిలింది. ఇన్నాళ్ళుగా మనసు పడ్డ మనిషి , ఎవరికోసం తపించిందో ఆ మనిషి తో జీవితంలోకి ప్రవేశైంచటం అంటే.. రాబోయే జీవితాన్ని అతడితోనే గడపటం అంటే ఎంత ఆనందమో కదా... అదొక వేడుక. ఊరినించి రాగానే అతడికి తెలియకుండానె అతడిని పెళ్ళికొడుకుగా ముస్తాబు చేసే సందర్బంలో వచ్చేదే ఈ సిన్ని సిన్ని పాట. ఆమె స్వయంగా తన వరుడిని ముస్తాబు చేసుకుంటుంది ఈ పాటలో. అతనికి తెలియకుండా పెళ్లికి ముహూర్తం నిర్ణయించి ఆనంద ఆశ్చర్యలలో ముంచేయ్యాలన్న ఆశ ఆమెది.
రమ్యమైన చిత్రీకరణ
తను పొందబోయే అదృష్టానికి లోలోపల ఆనందిస్తూ.. జరగబోయే వేడుకను ఊహిస్తూ ఎన్నో రకాల అలజడుల కలబోత ఈ పాట చిత్రీకరణ. ఎంతో సహజమైన రీతిలో తెరకెక్కించి మనం ముందు అవిష్కరింపజేసిన ప్రేమ కావ్యం. ఈ సందర్భంలో పాట పెట్టాలి అనుకోవటం విశ్వనాథ్ లోని సృజనకి అద్దం పడుతుంది. నది ఒడ్డున కుటీరం , దాని ముందు ముగ్గులు వేసి , మామిడి తోరణాలు కట్టటం. , దేవుడి పటానికి బొట్టు పెట్టి దానికి పూల దండ వేయటం పండగ వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. స్నానానికి నీళ్ళు కాగాయా లేదా అని వేలితో చూసి ఆ చురుకు కి వేలు కరచుకోవటం అనేది చాలా సునిశిత దృష్టి కి మాత్రమే అందే విషయం. మొహాన కాటుక బొట్టు , వెండి కమ్మలు , ఆభరణాలు , కాళ్లకి కడియాలు , జడలో తురుముకున్న బంతి పువ్వు , నడి ముక్కుకి తగిలించిన బెసరి , ప్రేమ వర్షించే కళ్ళు. అమాయకత్వానికి ప్రతీకలా ఉండే మోము... విజయశాంతి పల్లె అందంతో మెరుస్తుంది ఈ పాటలో ఆ కుటీరంలో తిరుగుతూ పనులు చక్కబెడుతున్నా తీరులో స్త్రీత్వపు అందం ప్రతిఫలిస్తుంది.
" నెలత తలపులే నలుగులుగా కలిపి కనులతో జలకాలు"
తలుపులన్నీ నలుగుగా కలిపి చూపులే జల్లుగా కళ్ళలో జలకాలు అంటూ అతనికి చుక్క బొట్టు పెట్టి తలంటి , నలుగు పెట్టి మంగళ స్నానం చేయిస్తుంది.
" సందిట నేసిన చెలువములే సుందర మూర్తికి చెలములు" నా మనసులోని స్నేహ భావన చెలముగా చేసి నీకందిస్తున్నాను అంటు మధుపర్కలకి పసుపు బొట్టు పెట్టి అందిస్తుంది , అతడితో పెళ్ళి పంచెని కట్టిస్తుంది. ఎందుకో ఏమిటో అర్థం కాక అతడు కాదూ కూడదు అంటూనే కట్టుకొని తయారు అవుతాడు. సాంబ్రణి పొగ తలకి పట్టించి...
" కలల ఒరుపులే కస్తురిగా ...వలపు వందనపు తిలకాలు"
" అంకము చేరిన పొంకాలే శ్రీ వేంకటపతి కిలా వేడుకలు"
కన్నుల్లో కలలు ఒరుచుకు పోవటం వల్ల వచ్చిన ఎరుపు తో వలపును వందనం గా సమర్పిన్నానూ అంటు అపురూపంగా అలా కళ్యాణ తిలకం దిద్దుతుంది. నిండైన విగ్రహతో పంచకట్టులో చిరంజీవి పెళ్ళి కొడుకవుతాడు. లేచి నిలబడగానే కనుబొమ్మలు తీర్చి దిద్ది వెళ్ళిపోతుంటే ఎటు పోతావు నిన్ను కట్టేసుకుంటున్నా అన్నట్టు చెయ్యికి కొంగు వేసి దగ్గరకి లాగి కళ్లనిండా చూసుకుంటుంది. అప్పుడు ఎంటీ కొత్తగా ఆటలూ పాటలూ పిచ్చిపిల్లా అన్నట్టు ఆమె తలమీద మొట్టికాయ వేయటం , కళ్లలో ఏదో పడింది అన్నట్టు నటించి అతడు చూద్దాం కళ్ళు చూపించూ అని కళ్ళలోకి ఊదుతుంటె మెల్లిగా కాటుక వేలికి అంటించుకొని అతడి బుగ్గన దిష్టిచుక్క పెట్టటం , అతడు అద్దంలో చూసుకొని అవాక్కవటం అనేది ప్రేక్షకులకి ఒక పులకింత. గంగ ప్రేమని అర్థం చేసుకున్నవాళ్లకి మనసులోతుల్లొంచి ఎగసిన రెండు ఆనందభాష్పాలు కళ్లల్లో చేరక మానవు.
పాట అంతా చిన్న చిన్న డిటెయిల్స్ లో దాగున్న సంస్కృతి సంప్రదాయాలని సహజంగా సరళంగా పట్టి చూపిస్తూ , కెమెరా కోణాలు , పాత్రల కదలికలకి అనుగుణంగా కెమెరా కదిలే విధానం అన్నింట్లోనూ విశ్వనాథ్ గారి మార్క్ కనపడుతుంది.
కలియుగదైవం వెంకటేశ్వర స్వామి కోసం వాగ్గేయ కారుడు అన్నమయ్య రాసిన కీర్తనేమో అన్నట్టు అనిపించినా , ఆ స్థాయిలో రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కలాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. సంగీతం కూర్చిన రమేష్ నాయుడు , సాహిత్యం అందించిన సీతారామ శాస్త్రి , తియ్యగా పాడిన జానకమ్మ , అందమైన చిత్రీకరణ చేసిన విశ్వనాథ్ , పాత్రల్లో ఒదిగిపోయి నటించిన విజయశాంతి , చిరులకి శత కోటి వందనాలు సమర్పించుకుంటూ ఈ తేనె ఊటలో... ఆనందామృత ధారలో మరో సారి తడిసి తరిద్దాం !!!
