Let's talk: editor@tmv.in
ప్రజాపాలన కాదు.. ప్రజా వంచన: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ప్రజాపాలన కాదు.. ప్రజా వంచన: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Gaddamidi Naveen
3 మే, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘99 రోజుల ప్రజాపాలన’ కార్యక్రమంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం దుబ్బాకలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో రైతుల సమస్యలపై ఆయన గళమెత్తారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై అధికారులను నిలదీస్తుండగా, వారు మైక్ కట్ చేయడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. అధికారుల తీరుకు నిరసనగా మైక్‌ను నేలకేసి కొట్టి, సభను బహిష్కరించి బయటకు వచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ధాన్యం అమ్ముకోలేక రోడ్లపై పడిగాపులు కాస్తుంటే, ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులు కన్నీరు పెడుతుంటే ప్రభుత్వానికి ఉత్సవాలా? ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వంచన విఫలోత్సవం అని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కాలువల నిర్వహణను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే వారు, ఇప్పుడు కాలువల్లో వస్తున్న నీరు ఏ ప్రాజెక్టుదో చెప్పాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఉండేవని, నేడు రైతులకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ బాధ్యతారాహిత్యం వల్ల పరిపాలన గాడి తప్పిందని, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదని విమర్శించారు. కులవృత్తులు దెబ్బతిన్నాయని, మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తమకు ప్రగతి నివేదికలు కాదు, ప్రజలకు నిజమైన అభివృద్ధి కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉత్సవాలు ఆపి, వెంటనే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.