
బీజేపీలో చేరడం లేదు: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
తాను భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆమె, ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిశారు. ఈ భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన పర్యటనపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు.
తమ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని, తివారీని కలిసినట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమానికి తాము పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం విద్యాసంస్థల కార్యకలాపాల్లో భాగంగానే ఈ భేటీలు జరుగుతున్నాయని, రాజకీయాలకు వీటికి సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు. దీంతో గత కొద్దిరోజులుగా ఆమె పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది.
