
నగరంలో కూల్చివేతలన్నీ మావి కావు.. హైడ్రా
నగరంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినప్పటికీ, వాటిని హైడ్రా ఖాతాలో వేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని హైడ్రా యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను గ్రహించకుండా కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని, వీడియోలను ప్రసారం చేస్తున్నారని, దీనిని కబ్జాదారులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపునకు, హైడ్రాకు సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లే ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నాయని తెలిపింది. పాతబస్తీ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ చర్యలు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయని, దీనిని అందరూ గమనించాలని సూచించింది.
హైడ్రా అసలు లక్ష్యం ఏమిటి?
హైడ్రా మాత్రం భారీ స్థాయిలో అక్రమ భూకబ్జాలపై దృష్టి సారిస్తుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటూ వందల ఎకరాల ప్రజా ఆస్తిని రక్షించినట్లు తెలిపింది. చెరువులు, నాలాలు, రహదారులు, పార్కులపై ఉన్న ఆక్రమణలను తొలగించడం, అలాగే రెవెన్యూ అధికారుల అభ్యర్థనల మేరకు ప్రభుత్వ భూములను కాపాడడం హైడ్రా బాధ్యతగా కొనసాగుతోంది. అదనంగా, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ పనులను కూడా హైడ్రా చేపడుతోంది. వర్షాకాలంలో వరదల సమస్యను తగ్గించడం, పర్యావరణహిత నగర నిర్మాణం లక్ష్యంగా తమ చర్యలు కొనసాగుతున్నాయని హైడ్రా పేర్కొంది.
కేవలం రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు మాత్రమే ప్రభుత్వ భూముల్లోని భారీ ఆక్రమణలను తొలగిస్తామని, చిన్న చిన్న మున్సిపల్ పనులను హైడ్రాకు ఆపాదించవద్దని సంస్థ కోరింది. సోషల్ మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.
