Let's talk: editor@tmv.in
మెగా డీఎస్సీ కాదు.. ‘దగా డీఎస్సీ’: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

మెగా డీఎస్సీ కాదు.. ‘దగా డీఎస్సీ’: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

Gaddamidi Naveen
30 మే, 2026

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న మెగా డీఎస్సీ అక్రమాల పుట్టగా మారిందని, ఇది నిరుద్యోగులను మోసం చేసిన "దగా డీఎస్సీ" అని వైఎస్సార్‌సీపీ ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి విరుపాక్షి పలు ప్రశ్నలు సంధించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పబ్లిసిటీ కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చి తీరా పరీక్షల్లో పేపర్ లీకేజీలు, డేటా డిలీషన్లు, మెరిట్ లిస్టుల మాయానికి తెరలేపారని ధ్వజమెత్తారు. మంత్రి లోకేష్ శాఖలో జరిగిన ఈ ‘డార్క్ ఆపరేషన్’ వెనుక ఉన్న అసలు నిజాలను ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఒక ఎస్సీఈఆర్‌టీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ టాపర్ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని పేర్కొన్నారు.

మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? ఎంపికైన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు పంపడం వెనుక అంతర్యమేమిటి? కలెక్టర్‌ కార్యాలయాల్లో అభ్యర్థుల జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదు? టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారిని ఉన్నపళంగా తొలగించి, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు మార్చారు? టీడీపీ నాయకుడే ఇంటికి పిలిచి ఒక్కో స్పోర్ట్స్ కోటా పోస్టును రూ. 15 లక్షలకు బేరసారాలు ఆడటం నిజం కాదా? అసలు క్రీడా మైదానంలోనే అడుగుపెట్టని వారికి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి, రిక్రూట్‌మెంట్‌ను వేలం పాటగా మార్చారని ఆరోపించారు.

ఇది మెగా డీఎస్సీ కాదు.. "మెగా లీక్ – మెగా అవినీతి" అని విరుపాక్షి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించి, ప్రతిభ ఉన్న అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.