Let's talk: editor@tmv.in
ఇరాన్‌కు ప్రయాణాలు వద్దు.. భారత పౌరులకు అడ్వైజరీ

ఇరాన్‌కు ప్రయాణాలు వద్దు.. భారత పౌరులకు అడ్వైజరీ

Shaik Mohammad Shaffee
25 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు ఎవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. వాయు, భూమి.. ఏ మార్గం ద్వారా కూడా ప్రస్తుతానికి ఇరాన్ ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది.

విమాన సర్వీసులపై అనిశ్చితి

ఇటీవలి కాలంలో భారత్ - ఇరాన్ మధ్య కొన్ని విమాన సర్వీసులు పునరుద్ధరించబడినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, వాటిని నమ్మవద్దని రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడిందని, గగనతల ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఏ క్షణంలోనైనా విమాన సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

సరిహద్దు దాటాలంటే అనుమతి ఉండాల్సిందే!

ఇరాన్‌లో ఉన్న భారతీయులు ఎవరైనా స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే, సొంత నిర్ణయాలతో నేరుగా సరిహద్దుల వద్దకు వెళ్లకూడదని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, బయలుదేరే ముందే తప్పనిసరిగా ఎంబసీ అధికారులను సంప్రదించి, వారు సూచించిన సురక్షితమైన మార్గాల ద్వారానే ప్రయాణించాలని పేర్కొంది. అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దులకు వెళ్తే భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంబసీ సూచనలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

అత్యవసర సహాయం కోసం

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఎలాంటి సందేహాలు ఉన్నా, అక్కడి నుండి సురక్షితంగా బయటపడటానికి సాయం కావాలన్నా వెంటనే భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) ప్రతినిధులను సంప్రదించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం +989128109115, +989128109102, +989128109109, +989932179359 నంబర్లకు ఫోన్ చేయాలని లేదా cons.tehran@mea.gov.in అనే ఈమెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.

పశ్చిమాసియా నుంచి కొనసాగుతున్న రాకలు

మరోవైపు పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు సుమారు 12,12,000 మంది ప్రయాణికులు ఆయా ప్రాంతాల నుండి భారత్‌కు చేరుకున్నారని, గల్ఫ్ దేశాల నుండి విమాన రాకపోకలు క్రమంగా మెరుగుపడుతున్నాయని, యూఏఈ నుండి భారత్‌కు రోజుకు సగటున 110 విమానాలు నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. అయితే ఇరాన్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది.