Let's talk: editor@tmv.in
డీలిమిటేషన్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: ప్రధాని మోడీ
డీలిమిటేషన్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: ప్రధాని మోడీ

డీలిమిటేషన్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: ప్రధాని మోడీ

Pinjari Chand
17 ఏప్రిల్, 2026

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో ఉత్తరం–దక్షిణం, తూర్పు–పడమర అనే తేడా లేకుండా ఏ రాష్ట్రానికీ వివక్ష చూపబోమని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు రాజకీయ రంగు పులమొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిలిచిన వారు ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి సంబంధించి తీసుకొచ్చిన మూడు బిల్లులపై జరిగిన చర్చలో జోక్యం చేసుకున్న ప్రధాని, అన్ని పార్టీలూ ఈ బిల్లులకు మద్దతు ఇస్తే అది ఏ ఒక్క పార్టీ రాజకీయ ప్రయోజనానికి కాకుండా దేశ ప్రయోజనానికి ఉపయోగపడుతుందని అన్నారు.

డీలిమిటేషన్‌పై అనవసర భయాలొద్దు

దేశంలో తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని, డీలిమిటేషన్‌పై వ్యక్తమవుతున్న భయాలు అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరమా, దక్షిణమా, తూర్పా, పడమరా, చిన్న రాష్ట్రాలా, పెద్ద రాష్ట్రాలా అన్న తేడా లేకుండా ఎవరికీ అన్యాయం జరగదు. ఈ ప్రక్రియలో ఏ రాష్ట్రానికీ వివక్ష ఉండదని పేర్కొన్నారు. అలాగే డిలిమిటేషన్ కారణంగా ఏ రాష్ట్రానికి ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తి తగ్గదని కూడా స్పష్టం చేశారు. స్థానాల సంఖ్య పెరిగినా అదే నిష్పత్తిలో పెరుగుతుందని చెప్పారు.

క్రెడిట్‌ మీరే తీసుకోండి

మహిళా రిజర్వేషన్ అమలు చేసిన క్రెడిట్‌ ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశం లేదని కూడా చెప్పారు. అవసరమైతే ప్రతిపక్షాలే క్రెడిట్ తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. మీరు క్రెడిట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ప్రకటనలు ఇవ్వాలంటే అందరి ఫోటోలు పెట్టడానికి కూడా నేను సిద్ధమని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు.

మహిళా రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా నిలిచిన వారిని దేశ మహిళలు క్షమించలేదని, తదుపరి ఎన్నికల్లో వారు తీవ్రంగా నష్టపోయారని మోడీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టంలో మార్పులు చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనితో పాటు డీలిమిటేషన్ బిల్లు, యూనియన్ టెర్రిటీస్ లాస్‌ (సవరణ) బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణల ద్వారా ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేసే మార్గం సుగమం కానుంది. ఈ బిల్లుల ప్రవేశపెట్టడంపై సుమారు 40 నిమిషాలపాటు జరిగిన చర్చ అనంతరం ప్రతిపక్షం ఓటింగ్ కోరింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో 251 మంది సభ్యులు మద్దతు ఇవ్వగా, 185 మంది వ్యతిరేకంగా ఓటేశారు.

మహిళలకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలి

దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు అత్యంత కీలకమైనవిగా ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో సమాజ దృక్పథం, నాయకత్వం కలిసి ఆ అవకాశాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ ఆలోచన 25–30 సంవత్సరాల క్రితమే వచ్చినప్పటికీ ఇప్పుడు అది అమలు దశకు చేరిందని తెలిపారు. దేశ జనాభాలో సగం భాగమైన మహిళలకు పాలనలో భాగస్వామ్యం కల్పించే ఈ చారిత్రక అవకాశాన్ని కోల్పోవద్దని సభ్యులను కోరారు. మహిళల భాగస్వామ్యం పెరగడం ద్వారా రాజకీయాల్లో కొత్త దిశ ఏర్పడుతుందని ఆయన అన్నారు. ‘వికసిత భారత్‌’ అంటే కేవలం రహదారులు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాదని, “సబ్కా సాథ్‌, సబ్కా వికాస్‌” అనే భావన కూడా అందులో భాగమని ప్రధాని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ బిల్లులకు ఏకగ్రీవ మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ లోక్‌సభ సభ్యులను కోరారు. అయితే డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఎవరికీ నష్టం కలగదు

మహిళా రిజర్వేషన్ అమలులో భాగంగా లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్యను 815కు పెంచి, అందులో 272 సీట్లను మహిళలకు కేటాయించనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. మహిళా రిజర్వేషన్ అమలు వల్ల పురుషులకు గానీ, ఏ రాష్ట్రానికీ గానీ నష్టం కలగదని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, యూనియన్ టెర్రిటీస్ లాస్‌ (సవరణ) బిల్లు–2026లపై చర్చ ప్రారంభిస్తూ మేఘ్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే ఇదే సరళమైన విధానమని, 815 సీట్లలో 272 సీట్లు మహిళలకు కేటాయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ బలం 543 సీట్లు కాగా, ప్రతిపాదిత చట్టాల ప్రకారం దాన్ని సుమారు 50 శాతం పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ చట్టం ప్రస్తుతం ఉన్న రూపంలో కొనసాగితే 2029 ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని, ఎందుకంటే అది జనగణన తర్వాత జరిగే డీలిమిటేషన్‌పై ఆధారపడుతుందని మేఘ్వాల్ చెప్పారు. అందుకే ఈ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చామని వివరించారు. భారతదేశంలో మొదటి ఎన్నికల నుంచే మహిళలకు ఓటు హక్కు కల్పించామని గుర్తుచేస్తూ, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో మహిళలకు ఓటు హక్కు చాలా ఆలస్యంగా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు సముచిత హక్కులు కల్పించడమే ఈ బిల్లుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

డీలిమిటేషన్‌ను బలవంతంగా అమలు చేయాలని కేంద్రం ప్రయత్నం

ఈ బిల్లులపై చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ ఉపనేత గౌరవ్‌గోగోయ్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్‌ను బలవంతంగా అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని, అయితే దాన్ని డీలిమిటేషన్‌కు అనుసంధానం చేయడం తగదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని సూచించారు. జమ్మూ–కశ్మీర్‌, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన డీలిమిటేషన్‌ను ఉదాహరణగా చూపిస్తూ, కేంద్రం దాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటోందని గోగోయ్ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయడమే లక్ష్యమైతే డీలిమిటేషన్‌ను ముందుకు తెచ్చే అవసరం లేదని చెప్పారు.